భాజపాయేతర, కాంగ్రెసేతర కూటమి కేంద్రంలో తీసుకొస్తా అంటూ ఆ మధ్య కేసీఆర్ బయల్దేరిన సంగతి తెలిసిందే. ఆ ఊపులో కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగొచ్చారు. అయితే, అసెంబ్లీ రద్దు చేసే పనిలోబడి, థర్డ్ ఫ్రెంట్ ఆలోచనల్ని పక్కనపడేశారు. ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడం మానేశారు. కానీ, మళ్లీ ఇవాళ్ల… నారాయణ్ ఖేడ్ లో ఆ ముచ్చట చెప్పారు కేసీఆర్. భాజపా కాంగ్రెస్ వాసన లేని ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని మళ్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తనతో కొట్లాడటం చేతతైనలేదనీ, అందుకే ఆంధ్రాకి బోయి చంద్రబాబు నాయుడుని తోల్కొచ్చారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా మనకి అని ప్రజలను కేసీఆర్ అడిగారు. చంద్రబాబు నాయుడిని ఓటుతో కొట్టి చూపించాలని పిలుపునిచ్చారు.
‘కేసీఆర్ ని కొట్టనీకి ఇంతమందా..? నరేంద్ర మోడీ, అమిత్ షా, వాడెవడో మషానం షా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, సీపీఐ, సీపీఎం…ఇంతమందా’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకి రావాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, భాజపాలు ఇంతవరకూ దేశంలో ఫ్యూడల్ పెత్తనం చేశాయన్నారు. ఫెడరల్ ఫ్రెంట్ రావాలని తాను కోరుతున్నా అన్నారు. ‘ఈ ఎలక్షన్ తరువాత బయల్దేరుతా నేను కూడా. నాకు అన్ని భాషలూ వస్తయి, అందుకే భయం వీళ్లకి. కేసీఆర్ ని ఇక్కడ్నే తెలంగాణలో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు’ అన్నారు. మనకు నిజమైన న్యాయం జరగాలంటే కాంగ్రెస్ లేని, భాజపా లేని ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలన్నారు. ఇప్పటికే తాను చాలామంది నాయకులతో మాట్లాడాననీ, కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారనీ, అందరూ కలిసి కాంగ్రెస్ భాజపా వాసనలేని జెండా పాతాలన్నారు. ఆ రెండు పార్టీల కర్ర పెత్తనం పోవాలంటే… తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలు కూడా తెరాస గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయనీ, వాటికీ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రెండో దఫా ఎన్నికల ప్రచారంలో నిన్నటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విమర్శలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన కేసీఆర్… ఇవాళ్ల మళ్లీ ఫెడరల్ ఫ్రెంట్ అంటున్నారు. భాజపాయేతర, కాంగ్రెసేతరం అంటున్నారు. వాస్తవానికి, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తానంటూ కాంగ్రెస్ తో చేతులు కలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆ దిశగా కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి, చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తరువాత తాను కూడా బయల్దేరుతా అని కేసీఆర్ చెప్పడం విశేషం. ఈ టాపిక్ ను ఇప్పుడు ప్రస్థావించడం వెనక… కాంగ్రెస్, భాజపాలకు తాను సమాన దూరం పాటిస్తున్నాను అనే సంకేతాలు ఇవ్వడమే లక్ష్యమా..?