ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన కారణంగా రెండు రాష్ట్రాలు చాలా భారీ ఆదాయం కోల్పోయాయి. ఆ లోటును భర్తీ చేసుకొనేందుకు రెండు రాష్ట్రాలు ఐటి, పారిశ్రామిక అభివృద్ధితో బాటు పర్యాటక రంగంపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఆ కారణంగా ఇంతవరకు తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన పర్యాటక రంగానికి మంచి ఊపు వచ్చింది. రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా అనేక సరికొత్త ఆలోచనలను అమలుచేయడానికి సిద్దం అవుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే హైదరాబాద్ లో హెలికాఫ్టర్ టూరిజం, ఆంధ్రాలో సీ-ప్లేన్ టూరిజానికి చాలా చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో వారం రోజులలోపే హైదరాబాద్ లో హెలికాఫ్టర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు తెలియజేసారు. అది అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలు సైతం హెలికాఫ్టర్ లో కూర్చొని హైదరాబాద్ అందాలను తిలకించవచ్చును. దీని కోసం ఆటం ఏవియేషన్ సర్వీసస్ మరియు ఇండ్ వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు అయ్యేయి. ఆ రెండు సంస్థలకు చెందిన హెలికాఫ్టర్లు గచ్చిబౌలి మరియు పీపుల్స్ ప్లాజా నుండి త్వరలో ప్రజలకు తమ సేవలు అందిస్తాయి. సుమారు 15నిమిషాల పాటు హైదరాబాద్ లో అన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలను తిప్పి చూపిస్తారు.
ఇక ఆంధ్రాకు సువిశాలమయిన ఆకర్షణీయమయిన సముద్ర తీరం, రాష్ట్రం మధ్యలో కృష్ణా, గోదావరి నదులు కలిగి ఉండటం చేత దానిని ఉపయోగించుకొని నీటి మీద దిగి, టేకాఫ్ తీసుకోగల చిన్న చిన్న సీ ప్లేన్స్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దాని కోసం స్కై చాపర్ అనే ప్రైవేట్ విమాన సంస్థతో చర్చలు సాగిస్తోంది. అవి ఫలిస్తే వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల మధ్య ఈ సీ-ప్లేన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైజాగ్ లో భీమిలి బీచ్ ఇందుకు చాలా అనువుగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుండి ఈ సీ-ప్లేన్స్ పర్యాటకులను తీసుకొని వైజాగ్ లోని అన్ని పర్యాటక కేంద్రాలను చూపించుతాయి.
ఈ సీ-ప్లేన్స్ నేలపై దిగి మళ్ళీ టేకాఫ్ చేసుకొనే వీలుంది కనుక వీటి ద్వారానే వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. లాభసాటిగా ఉన్నట్లయితే ఇంకా చిన్న చిన్న పట్టణాలకు కూడా ఈ ఈ సీ-ప్లేన్స్ సేవలను విస్తరించవచ్చును. ఒక్కో సీ-ప్లేన్ లో 5 నుంచి 15 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది కనుక టికెట్ ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోనే ఉండవచ్చును. ఇందులో కనీస టికెట్ ధర రూ.3000-3500 మధ్య ఉండవచ్చని స్కై చాపర్ విమాన సంస్థ ప్రతినిధి తెలియజేసారు. అన్నీ సజావుగా జరిగితే మూడు నెలలోగానే ఈ ఈ సీ-ప్లేన్స్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.
ఈ సీ-ప్లేన్స్ తో బాటు ‘స్పీడ్ బోట్స్’ ని కూడా ప్రవేశపెట్టదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి సుదూర ప్రాంతాల నుండి, విదేశాల నుండి చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఇప్పుడు ఈ స్పీడ్ బోట్స్ మరియు సీ-ప్లేన్స్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగం మరొక స్థాయికి చేరుకొంటుంది.