తెలంగాణ ఎన్నికల పర్వం లో ఎన్నికల ప్రచారంలో ప్రజా కూటమి దూసుకుపోతోంది. తెలుగుదేశం, కాంగ్రెస్, కోదండరాం తెలంగాణ జన సమితి, సీపీఐ లాంటి పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ప్రజా కూటమి మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికి గత నెల రోజుల్లో బాగా పుంజుకుంది. తెలుగుదేశం పార్టీకి స్వతహాగా ఉండే మీడియా బలం, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండే క్యాడర్ బలం తోడవడంతో ఒక నెల కిందట తో పోలిస్తే ఇప్పుడు ఈ కూటమి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కూటమి ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాటలలో దొర్లిన చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజా కూటమి ఎన్నికల ప్రచారంలో, బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు – తమ కూటమి లో తెలుగుదేశం, కాంగ్రెస్ తో పాటు, ప్రొఫెసర్ కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి కూడా ఉంది అని చెప్పబోతూ, తెలుగుదేశం ,కాంగ్రెస్, జనసేన కూడా ఉంది అన్నారు. అయితే వాక్యం పూర్తి చేయక మునుపే తన మాట లో దొర్లిన పొరపాటును గ్రహించిన చంద్రబాబు తెలంగాణ జనసేన అంటూ తన పొరపాటును సరిద్ధిదుకునే ప్రయత్నం చేశారు. అయితే కోదండరాం పార్టీ పేరు తెలంగాణ జనసేన కూడా కాదు, అది తెలంగాణ జన సమితి.
అయితే చంద్రబాబు మాటల్లో దొర్లిన ఈ పొరపాటు గురించి నెటిజన్లు – తమ కూటమి లో ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ పూర్తి పేరు కూడా చంద్రబాబుకి స్పష్టంగా తెలియదు అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం తెలుగుదేశం పార్టీ పై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతున్న జనసేన పార్టీ చంద్రబాబును ఎంత కలవర పెట్టిందో కదా, అందుకే తెలంగాణలో కూడా చంద్రబాబు జనసేన పేరును పలవరిస్తున్నారు అంటూ సరదాగా విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మాటల్లో దొర్లిన ఈ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.