తెలంగాణ ఎన్నికల పర్వం లో ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ విమర్శనాస్త్రాలు ఒక్కోసారి దూకుడుగా ఉంటే ఇంకొన్నిసార్లు ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. కేటీఆర్ కూకట్పల్లి ప్రచార సందర్భంగా చంద్రబాబుపై ఇలాంటి ఆలోచనాత్మక అస్త్రాలు సంధించారు.
కూకట్పల్లి నియోజకవర్గం లో నందమూరి సుహాసిని పోటీ చేయించడం ద్వారా చంద్రబాబు మరొకసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచుకు టికెట్ ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా నియోజకవర్గంలో పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు సఫలీకృతుడయ్యాడు. నందమూరి హరికృష్ణ మరణానంతరం ఆయన కుటుంబానికి చెందిన ఆడపడుచు కి టికెట్ ఇవ్వడం ద్వారా ఒకవైపు ఆ కుటుంబానికి తాను ఆసరాగా నిలిచాను అన్న సంకేతాలు ప్రజల్లోకి పంపవచ్చు. అదే సమయంలో నందమూరి సుహాసిని పోటీ చేయడం ద్వారా చుట్టుపక్క నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి సానుకూల వాతావరణం ఏర్పడే కారణంగా రాజకీయ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇది బాబు రాజకీయ చతురత . అయితే కుకట్పల్లి ప్రచార సందర్భంగా కేటీఆర్, చంద్రబాబుపై ఇదే అంశం మీద విమర్శనాస్త్రాలు సంధించాడు.
కేటీఆర్ మాట్లాడుతూ, నిజంగా చంద్రబాబుకి నందమూరి కుటుంబం పై అంత ప్రేమే గనక ఉంటే ఆ కుటుంబానికి చెందిన ఒకరిని, లోకేష్ లాగా -ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఎమ్మెల్సీ చేసి , వారికి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అంటూ వ్యాఖ్యానించాడు కేటీఆర్. అలా చేయకుండా , ఓడిపోయే స్థానంలో నందమూరి సుహాసిని గారిని ఎన్నికలకు నిలబెట్టి అనవసరంగా ఆవిడను చంద్రబాబు బలిపశువు చేస్తున్నాడు అంటూ సుతి మెత్తగా విమర్శించాడు కేటీఆర్. అలాగే కూకట్పల్లిలో అధికంగా ఉండే ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో కానీ హైదరాబాదులో కానీ ఎక్కడ తెలంగాణా మరియు ఆంధ్ర అంటూ విభేదాలు జరగలేదని ప్రజలందరూ సాఫీగా ఇబ్బంది లేకుండా జీవిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించాడు. అనవసరంగా చంద్రబాబు మధ్యలో దూరి విభేదాలు రాజేస్తున్నాడని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా నందమూరి కుటుంబం పై అంత ప్రేమే గనక ఉంటే ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా టిడిపి తరఫున ఎమ్మెల్సీ ఇచ్చి వారిని మంత్రి చేసే అవకాశం చంద్రబాబుకు ఎప్పుడూ ఉంది. మరి భవిష్యత్తులోనైనా చంద్రబాబు, నందమూరి కుటుంబానికి చెందిన ఒకరినైనా అలా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.