ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు రెండూ కూడా ప్రత్యేక హోదా సాధించాలని పోరాటం మొదలుపెట్టి ప్రజల నుండి సరయిన స్పందన రాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశాయి. అందుకు కారణాలు అందరికీ తెలుసు. ఒకసారి దీనిపై పోరాడి విఫలమయిన తరువాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే అంశం పుచ్చుకొని యువభేరి పేరిట విద్యార్ధుల దగ్గరకు వెళ్ళడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి అంత బలమయిన మరో అంశం ఏదీ లేకపోవడం చేతనే ఆయన మళ్ళీ దీనిపైనే పోరాటానికి సిద్దం అవుతున్నారేమో? ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష చాలా ఘోరంగా విఫలమయిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు అంత బలమయిన అస్త్రమేదీ దొరకకపోవడంతో వైకాపాలో ఒక రకమయిన స్తబ్దత నెలకొని ఉండటం గమనించవచ్చును. దానిని ఇంకా కొనసాగించినట్లయితే పార్టీ అచేతనావస్థలోకి జారుకొనే ప్రమాదం ఉంది. అలా జరుగకూడదంటే ఏదో ఒక అంశం తీసుకొని పోరాటం చేస్తూనే ఉండాలి.
జగన్ చేతిలో అటువంటి బలమయిన అస్త్రమేదీ లేకపోవడం చేతనే మళ్ళీ ప్రత్యేక హోదాని ఎంచుకొని ఉండవచ్చును.ఈ సందర్భంగా వైకాపాలో కొత్తగా చేరిన నాయకుడు ఒకరు విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనందరి తరపున అలుపెరుగని పోరాటం చేసేందుకు జగనన్న సిద్దంగా ఉన్నారు. ఆయన పోరాటానికి మనమందరం అండగా నిలబడతామని హర్షద్వానాలతో తెలియజేయండి” అని కోరడం చాలా సాధారణమయిన విషయంగానే కనిపిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వారి మద్దతు కోరుతున్నారని అది తెలియజేస్తోంది. కానీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమో లేక చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్ష తీర్చుకొనేందుకో జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చేయదలిస్తే వాటికి ప్రజల సహాకారం లభించదని ఇదివరకే ఒకసారి నిరూపించారు. కనుక మళ్ళీ ఆయన అవే ఉద్దేశ్యాలతో ఉద్యమించి పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మళ్ళీ నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది.