ఓటర్ల జాబితాపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా! రాష్ట్రంలో చనిపోయినవారి పేర్లతో ఓట్లు ఉంటున్నాయనీ, ఒక నియోజక వర్గంలో చనిపోయిన వ్యక్తి పేరుతో మరో నియోజక వర్గం లేదా పక్క నియోజక వర్గాల్లో ఓట్లు ఉన్నాయంటూ ఓ సర్వే తేల్చింది అంటూ సాక్షి మీడియా కథనం రాసింది. చనిపోయినవారి పేరుతో లక్షలకుపైగా ఓట్లున్నట్టు ఓ సంస్థ తేల్చిందని చెప్పింది. ఇలాంటి అవకతవకల వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాలుగా మారుతుందన్నారు. అంతవరకూ ఓకే. కానీ, ఓటర్ల జాబితా అవకతవకలకు కారణం అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరే అన్నట్టుగా కథనంలో వ్యాఖ్యానించారు..!
జాబితాలో పసికందుల పేర్లతో కూడా ఓట్లున్నాయనీ, క్షేత్రస్థాయి సిబ్బందితో అధికార పార్టీకి చెందిన నాయకులే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంతేకాదు, ఎన్నికల సర్వే పేరుతో రాష్ట్రంలో కొన్ని బృందాలు తిరుగుతున్నాయనీ, ఓటర్ల జాబితాలో వైకాపా అభిమానులను గుర్తించి, వారి దగ్గర ఓటరు ఐడీ నంబర్ తీసుకుని.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, కొన్ని క్షణాల్లోనే జగన్ అభిమానుల పేర్లను తొలగిస్తున్నారంటూ కథనంలో పేర్కొంది. వైకాపా ఓట్ల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని నకిలీ బృందాలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయని రాసేశారు.
ఓటర్ల జాబితా సరిగా లేదనడం, దాన్ని సరిచేయాలని ఈసీని డిమాండ్ చెయ్యడం వరకూ ఓకే. కానీ, ఆ అక్రమాలకు కారణం అధికార పార్టీయే అని ఆధారం లేని ఆరోపణలు రాశారు. క్షేత్రస్థాయిలో సర్వే పేరుతో ఎవరు వచ్చినా… ఓటరు ఐడీ కార్డు నంబర్లు ఎందుకు అడుగుతారు..? అడిగినా ప్రజలు ఎందుకిస్తారు..? ఒకవేళ ఐడీ కార్డు చూపించినా కూడా… ఆ నంబర్ సాయంతో ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉన్న పేర్లను ప్రైవేటు వ్యక్తులు ఎలా డిలీట్ చెయ్యగలుగుతారు..? ఓటర్ల జాబితాపై ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న సాక్షి… వీటిపై కూడా మరింత స్పష్టంగా వివరణ ఇస్తే బాగుండేది. ‘కొన్ని నకిలీ బృందాలు’ క్షేత్రస్థాయిలో వైకాపా ఓటర్ల తొలగింపు లక్ష్యంగా తిరుగుతుంటే… ఆయా బృందాలపై ఫిర్యాదు చెయ్యొచ్చు. ఆధారాలను ఎన్నికల సంఘానికే నేరుగా పంపి, చర్యలకు డిమాండ్ చెయ్యొచ్చు. అంతేగానీ, ఆధారాలేంటో చెప్పకుండా… ఇలా కథనాలు రాస్తూ పోవడం వల్ల ఏం ఉపయోగం..?
ఇంకోటి, మరణించినవారి పేర్లతో కూడా ఓట్లన్నీ దొంగ ఓట్లుగా మారే అవకాశం ఉందన్నారు. అదెలా సాధ్యం..? మరణించిన వారి పేరు జాబితాలో ఉందే అనుకుందాం! ఓటరు ఐడీ తీసుకెళ్లకుండా పోలింగ్ బూతులో ఎవ్వర్నీ ఓటు వెయ్యనియ్యరు కదా. ఇంకోటి… పసికందుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయన్నారు. జాబితాలో ఉన్నంత మాత్రాన పసికందులను పోలింగ్ బూతుల్లోకి రానిచ్చి, ఓటేసే అవకాశం ఇస్తారా..? జాబితాలో తేడాలంటే.. వాటిని కచ్చితంగా సవరించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు. కానీ, కేవలం తమ ఓటర్లను తగ్గించడానికే ఇదంతా జరుగుతోందనే కోణంలో వైకాపా పత్రిక ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది.