ఎన్టీఆర్ బయోపిక్ లో తారల హంగామా మామూలుగా లేదు. ఓ రకంగా… టాలీవుడ్లో ఉన్న కథానాయికలంతా ఈసినిమాలోనే కనిపించనున్నారు. ఎన్టీఆర్ – ఆనాటి కథానాయికల అనుబంధం చూపించడానికి… ఈ తరంలో కొంతమంది కథానాయికల్ని ఈ బయోపిక్‌లో తీసుకున్నాడు క్రిష్. సావిత్రి, శ్రీదేవి, జయసుధ, జయప్రద… ఇలా చాలామందిని తెరపై చూపించబోతున్నాడు. అయితే.. ఈ పాత్రల్లో కనిపించే చాలామందికి డైలాగులే ఉండవని తేలింది. మరీ ముఖ్యంగా జయసుధ (పాయల్ రాజ్పుట్), జయప్రద (రాశీఖన్నా)లు ఒక్క మాట కూడా మాట్లాడలేదట. వీరిద్దరూ కలసి ఓ పాటలో కనిపిస్తారని తెలుస్తోంది. `అడవి రాముడు`లో `ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ ఎవ్నెల్లే తిరిగొచ్చే మా కళ్లకూ` అనే గీతం ఉంది. అందులో జయసుధ, జయప్రద ఇద్దరూ కనిపిస్తారు. `ఎన్టీఆర్` బయోపిక్ కోసం ఈ పాట వాడుకున్నారు. అందులోనే రాశీఖన్నా, పాయల్ రాజ్ పుట్ లను చూపిస్తారు. చిన్న పాటలో… కొన్ని షాట్స్ లలో చూపించినంత మాత్రాన.. వాళ్లే జయసుధ, జయప్రద అని ఎలా తెలుస్తుంది? అందుకే… `జయసుధ, జయప్రదలు వాళ్లే` అని తెలిసేలా… క్రిష్చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నాడిక్కడ. అదేంటన్నది తెరపై చూడాలి. వీళ్లనే కాదు.. చాలా పాత్రలు ఒక్కట్రెండు డైలాగులకే పరిమితమని, శ్రీదేవి (రకుల్ ప్రీత్ సింగ్) మాత్రం రెండు కీలక సన్నివేశాల్లో కనిపిస్తుందని తెలుస్తోంది.