కథానాయికుడి కంటే ప్రతినాయకుడి పాత్రని శక్తిమంతంగా చూపించడం రాజమౌళి స్టైల్. ఓ రకంగా.. రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్రలే బాగా పేలుతుంటాయి. ఇప్పుడు రాజమౌళి తనయుడు కూడా అదే ఫార్మెట్లో వెళ్తున్నాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశవాణి.` ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదో పిరియాడికల్ చిత్రం. కాన్సెప్ట్ కూడా చిత్రవిచిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో కథానాయకుడి కంటే.. ప్రతినాయకుడి పాత్రే కీలకమని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని సంప్రదిస్తున్నారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కన్నడ, మలయాళ చిత్రాలలో నటించి, స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ కథానాయకుడు ఇందులో ప్రతినాయకుడి పాత్రని పోషించబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళినే స్వయంగా రంగంలోకి దిగి… ఆ స్టార్ హీరోని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి అడిగితే.. ఎవరు కాదంటారు..? అటు వైపు నుంచి కూడా అంతా ఓకేనే. అతనెవరన్నది అతి త్వరలో ప్రకటిస్తారు. జనవరి నుంచి చిత్రీకరణ మొదలవుతుంది.