విభజన తరువాత ఆంధ్రాకి కడప స్టీల్ ప్లాంట్ కేంద్రం ఇవ్వలేదు. దాని కోసం ఏపీ సర్కారు పోరాటం చేస్తోంది. చివరికి, కేంద్రం సాయం కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఫ్యాక్టరీ నిర్మాణానికి మరో వారం రోజుల్లో ముహూర్తం కూడా పెట్టుకుంది. తెలంగాణకి కూడా బయ్యారం ఉక్కు కర్మాగారం కేంద్రం ఇవ్వాల్సి ఉంది. దానిపై కూడా మోడీ సర్కారు ఇన్నాళ్లూ మీన మేషాలు లెక్కిస్తూనే వచ్చింది. ఇప్పుడా ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు. ఇల్లందు సభలో ఆయన మాట్లాడుతూ.. ఉక్కు ఫ్యాక్టరీని వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది అన్నారు. తాము ఏనాడూ ఎవన్నీ భిక్షమెత్తుకోమన్నారు. ఈ మాటను తాను ఆషామాషీగా చెప్పడం లేదనీ, పూర్తి స్పష్టతతో తాను చెబుతున్నా అన్నారు కేసీఆర్.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రధానమంత్రి మోడీకి చాలాసార్లు విన్నవించానన్నారు. దాదాపు ఓ 30కిపైగా దరఖాస్తులు తాను కేంద్రానికి పెట్టానన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఫలానా రాయితీ ఇయ్యాలీ, ఫలానా పని చెయ్యాలని కేంద్రమంత్రి కోరారనీ… ఇవన్నీ ఇచ్చేబదులు మేము చేసుకుంటే సరిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘అందుకే, కేంద్రం గీంద్రం జాన్తానై. సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి, అవసరమైతే రాష్ట్ర ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం. కానీ, దీన్ని వదిలే ప్రసక్తే లేదని మనవి చేస్తున్నా’ అని చెప్పారు కేసీఆర్. ఉన్న వనరుల్ని బ్రహ్మాండంగా వాడుకుంటామన్నారు. అందుకే, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడతారనీ, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్కచోటైనా రైతు బీమా ఉందా, రైతుబంధు ఉందా అని ప్రశ్నించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడితే మోసపోవడానికి ఇక్కడెవ్వరూ గొర్రెలు లేరు, ఇది పులిలాంటి తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ అంటూ ప్రసంగించారు.
బయ్యారం ఫ్యాక్టరీ విషయంలో గడచిన నాలుగున్నరేళ్లలో కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేసిన దాఖలాలు లేవు! 30 సార్లు దరఖాస్తులు ఇచ్చానని ఇప్పుడు చెబుతున్నారు. కేంద్రం మెడలు వంచుతామని ఇప్పుడు అంటున్నారు. ఆ వెంటనే, ఎవ్వర్నీ భిక్షమెత్తుకోమనీ… అవసరమైతే తామే ఫ్యాక్టరీ కట్టుకుంటామంటున్నారు. ఇన్నాళ్లూ కేంద్రంతో బయ్యారం అంశమై పోరాటం చేసి ఉంటే ఈ వ్యాఖ్యలకు కొంత అర్థం ఉండేది. సొంతంగా ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టేసి ఉన్నా ఇంకొంత బాగుండేది! రాష్ట్రానికి కేంద్రం ఇయ్యాల్సిన వాటిపై ఇంతవరకూ ఎలాంటి పోరాటమూ చెయ్యకుండా… ఇప్పుడేమో, మరోసారి అవకాశమిస్తే సాధించి చూపిస్తామంటున్నారు కేసీఆర్.