ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ వ్యాఖ్యానించడం చర్చనీయం అవుతోంది. తనకు రాష్ట్ర ప్రభుత్వ బలగాలపై నమ్మకం లేదనీ, కేంద్ర బలగాలు రక్షణగా కావాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అంతేకాదు, ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పర్యటనను కూడా రేవంత్ వాయిదా వేసుకున్నారు. తనపై ఏ క్షణమైనా దాడి జరగొచ్చనీ, మఫ్టీలో ఉండే పోలీస్ అధికారులతో దాడికి కుట్రలు జరుగుతున్నాయంటూ రేవంత్ మీడియాతో చెప్పారు. నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలక పాత్ర పోషించిన కొందరు అధికారులతో తనపై దాడి చెయ్యడానికీ, అవసరమైతే అంతమొందించడానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉందని ఆరోపించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, డీఐజీ ప్రబాకర్ ఈ ప్లాన్ అమలు చేస్తున్నారన్నారు.
పార్టీ ఫిరాయింపుల గురించి తాను గతంలోనే చెప్పాననీ అది నిజమైందన్నారు. ఐటీ, ఈడీ అధికారుల గురించి కూడా తాను చెప్పాననీ, అదీ నిజమైందని రేవంత్ అన్నారు. తాను కొడంగల్ వెళ్తున్నాననీ, ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పారు.
ఈ ఎన్నికల్లో రేవంత్ ని కొడంగల్ లో ఓడించేందుకు భారీ వ్యూహంతోనే తెరాస సిద్ధమౌతోందన్న కథనాలు చాన్నాళ్ల నుంచీ ఉన్నవే. అసెంబ్లీ వరకూ రేవంత్ ని రానివ్వకూడదనేది ఆ పార్టీ అప్రకటిత వ్యూహం అనేది బాగా ప్రచారంలో ఉంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఈ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రేవంత్ కాంగ్రెస్ లో చేరిన వెంటనే… ఆయన అనుచరుల్లో కొంతమంది తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నం ఆ మధ్య చేశారు. ఈ నియోజక వర్గంలో రేవంత్ కి పోటీగా మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తెరాస తరఫున ప్రచారానికి మంత్రి కేటీఆర్ కూడా ఇటీవలే వచ్చారు. తెరాసకు ధీటుగా సోనియా గాంధీతో సభ ఏర్పాటు చేసి, విజయవంతం చేశారు రేవంత్.
అయితే, రెండ్రోజుల కిందటే కొడంగల్ లో సొమ్ము పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ వర్గం నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. కొడంగల్ ఎన్నికను వాయిదా వేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనీ, దానికి అనుగుణంగానే తెర వెనక ఏదో జరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారాన్ని కూడా రేవంత్ వాయిదా వేసుకున్న పరిస్థితి..! దీంతో కొడంగల్ లో ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.