వంద శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాది… అందుకే ఓట్లడుగుతున్నామని … కేసీఆర్ ప్రతి బహిరంగసభలోనూ చెబుతూ ఉంటారు. దానికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర్నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్య వరకూ … చాలా ఖరీదైన హామీల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక ఇంటింటికి నల్లా నీరు ఇచ్చిన తర్వాత ఓట్లడుగుతానని.. ఆయన పదుల సార్లు.. ప్రజల ముందు గొప్పగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ.. నీళ్లు ఏ గ్రామంలో ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఇప్పటికి 30, 40 శాతం గ్రామాలకు మంచి నీళ్లు సరఫరా అవుతున్నాయని బుకాయించొచ్చు కానీ.. ఆ గ్రామాలకు అంతకు ముందు.. మంచినీటి సరఫరా లేదా అన్న ప్రశ్న మాత్రం అడగకూడదు. అయితే ఇవన్నీ రాజకీయ పార్టీల నుంచి వచ్చే విమర్శలు మాత్రమే కాదు… సామాన్య ప్రజల నుంచి వస్తున్న సందేహాలు కూడా. అవి నేరుగా.. ప్రభుత్వానికే తగులుతున్నాయి. కాకలు తీరిన రాజకీయ నాయకుడు కాబట్టి .. కేసీఆర్ పట్టించుకోకుండా.. అన్నీ చేసేశాం అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఒక వేళ కాకపోయినా.. ఆరు నెలల్లో వచ్చేస్తాయి… ఏమైనా కొంపలు మునిగిపోతాయా.. అంటూ కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు.. షెడ్యూల్ ప్రకారం.. జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలు ఎందుకు ముందుకు జరిపారనేది… ఎవరికీ అర్థం కాదు. అయినా … ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం… బయటపడిపోతూ ఉంటారు. కాకపోతే రివర్స్ ఇంజినీరింగ్ చేస్తూ.. తాను కూడా దానికి బాధపడుతున్నట్లు చెప్పుకొస్తూ ఉంటారు.
కొద్ది రోజుల కిందట.. హైదరాబాద్ రోడ్ల దుస్థితి హైలెట్ అయింది. అప్పుడు కేటీఆర్.. నిజమే మా మిత్రులు కూడా.. హైదరాబాద్ రోడ్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ గెలవగానే… కొన్ని వేల కోట్లు పెట్టి రోడ్లేస్తాం అనే శారు. మొన్నటికి మొన్న గాంధీ ఆస్పత్రిలో… అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఎమెర్జెన్సీ వైద్యం కోసం వచ్చిన.. యాక్సిడెంట్ కేసును పట్టించుకోని వైనాన్ని… మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా హృదయవిదారకంగా… పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయిపోయింది. దీంతో.. కేటీఆర్ కూడా… బాధపడిపోయారు. తాను మళ్లీ వచ్చాక.. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇక అత్యంత కీలకమైన డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ.. ఇదే రివర్స్ ఇంజినీరింగ్ అమలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో తనకూ ఆసంతృప్తి ఉందని ప్రకటించుకున్నారు. ప్రచారసభల్లో ఇదే చెబుతున్నారు. ఆడబిడ్డల రుణం ఉంచుకోమని… చెబుతూ.. ఇళ్ల పథకంలో మార్పులు చేసి.. అందరికీ ఇళ్లిస్తామని కొత్త కబురు చెబుతున్నారు.
నిజానికి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. టీఆర్ఎస్కు ఓ గేమ్ చేంజర్. గ్రేటర్ ఎన్నికలకు ముందు సనత్ నగర్లో.. ఓ నలభై డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి.. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా.. దాన్ని మోడల్ ఫ్లాట్స్ గా మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. వెంటనే.. అన్ని బస్తీల నుండి ధరఖాస్తులు తీసుకున్నారు. ఈ ధరఖాస్తులకూ… గులాబీ చోటా నేతలు డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ స్వీప్ చేసింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కానీ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రం.. ఎవరికీ రాలేదు. అదే ప్రజల్లో రగిలిపోతోంది. గ్రేటర్ పరిధిలో బస్తీల్లో ఈ హామీనే.. టీఆర్ఎస్ పాలిట గుదిబండగా మారింది. ఈ విషయం తెలిసింది కాబట్టే.. పథకంలో మార్పులు.. ఆడబిడ్డల రుణం ఉంచుకోమంటూ… కేటీఆర్ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు దేన్నైనా సహిస్తారేమో కానీ.. మోసం చేసి.. మళ్లీ కబుర్లు చెప్పేవారిని సహించలేరేమో..?