తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఎన్నికల కోసం.. రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని… ప్రజాకూటమి నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ లోగా మరో రూ. వెయ్యి కోట్లను పంచబోతున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందంటున్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరింత తీవ్రమైన విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ రూ.50వేల కోట్లు దోపిడీ చేసినట్లు లెక్కలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతల మీద ట్యాపింగ్, ట్రాకింగ్ కుట్రలు చేస్తున్నారని.. ఆరోపించారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టిన ఖర్చు ఎంతని ప్రశ్నించారు.
కేసీఆర్ జుట్టు మోడీ చేతుల్లో ఉందని ..పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈఎస్ఐ భవన నిర్మాణ కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కుంభకోణంలో ఏ-1గా కేసీఆర్ ఉన్నారన్నారు. కంటి శస్త్రచికిత్స పేరుతో ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి ఛార్జిషీట్లో తన పేరును తొలగించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఛార్జిషీట్లో కేసీఆర్ పేరు కూడా ఉందన్నారు. అలాగే సహారా కేసులో ప్రజాధనం దుర్వినియోగానికి ప్రధాన నిందితుడు కేసీఆరేనన్నారు. గతంలో… బతుకమ్మ సంబరాలు జరుగుతున్నప్పుడు… గవర్నర్ తో కలిసి.. ఆ వేడుకల్లోకేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ అదే సమయంలో సీబీఐ రావడంతో రోజు మొత్తం విచారణలో ఉన్నారని రమణ గుర్తు చేశారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అక్రమాలన్నింటినీ బయటపెడతామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోయినా ఎందుకు ప్రశ్నించడంలేదని ప్రజాకూటమి నేతలు కేసీఆర్ను నిలదీశారు. సోనియాపై.. కేసీఆర్ విమర్శలు చేయడాన్ని ఖండించారు. మేడ్చల్ సభలో సోనియా చాలా హుందాగా విమర్శలు చేస్తే.. రాహుల్, సోనియా, చంద్రబాబులపై కేసీఆర్ విమర్శల తీరు హేయమైనదన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఏ పథకాన్ని అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖర్చుపై.. రోజుకో రచం ప్రచారం జరుగుతోంది. అవన్నీ చాలా పెద్ద స్థాయిలోనే ఉంటున్నాయి. తాజాగా ప్రజాకూటమి నేతల ఆరోపణలతో .. మరింత సంచలనాత్మకమయ్యాయి.