ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ వర్సెస్ సీబీఐ అన్న పరిస్థితి వచ్చేసింది. ఏసీబీ తొలిసారిగా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ ఎం.కె. రమణేశ్వర్ రూ.30వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఓ వ్యాపారికి సంబంధించి సీజీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించిన ఒక రసీదు లేదని, ఆడిట్లో ఇబ్బంది పెట్టకుండా చూడాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.30 వేలకు ఒప్పుకొన్నారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ను సంప్రదించారు. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ విభాగానికి కేసును అప్పగించారు ఠాకూర్. రమణేశ్వర్ ఇంటి ముందు పార్కులో లోకేశ్‌బాబు నుంచి ఆయన లంచం తీసుకొంటుండగా పట్టుకున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే ఈ కేసు నమోదుపై సీబీఐ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. అవినీతి ఉద్యోగుల సమాచారాన్ని ఏపీ సర్కారు ఏసీబీకి లీక్ చేసిందని సీబీఐ అధికార ప్రతినిధి ఢిల్లీలో ఆరోపించారు. రమణేశ్వర్ పై ఫిర్యాదు తమకే వచ్చిందని.. జనరల్ కన్సెంట్ లేనందున.. పర్మిషన్ అడిగామని సీబీఐ చెబుతోంది. తమకు అనుమతి ఇస్తే.. మరింత మందిని పట్టుకునేవాళ్లమని సీబీఐ చెప్పుకొచ్చింది. దీనిపై డీజీపీ ఠాకూర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపై… 22న ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు వచ్చిందని …అన్ని కోణాల్లో నిర్ధారించుకున్నాకే ఉద్యోగిని పట్టుకున్నామని ప్రకటించారు. ఏసీబీలో సొంత నిర్ణయాలు ఉండవని .. మాకు ఎంతో మంది సమాచారం ఇస్తుంటారు…పేర్లు బయటపెట్టలేమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే… ఏసీబీ మౌనంగా కూర్చోవాలా? అని డీజీపీ ఠాకూర్ ప్రశ్నించారు. అవినితీ నిర్మూలనకు అందరి సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర ఉద్యోగులపై ఏసీబీ దాడులు ప్రారంభించడంతో.. కొంత అలజడి రేగుతోంది. ఏపీ సర్కిల్లో ఉన్న కొంత మంది ఐటీ అధికారులు.. రాజకీయ కారణాలతో.. టీడీపీ నేతలను టార్గెట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సార్లు టీడీపీ నేతలు ఆయా అధికారుల పేర్లను కూడా చెప్పారు. ఇప్పుడు అలాంటి వారిపై నిఘా పెట్టి మరీ పట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో … కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలోనూ… ఆందోళన ప్రారంభమయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణంతో తాము ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు.