కూకట్ పల్లి నియోజక వర్గం ఎన్నిక రానురానూ అత్యంత ఆసక్తికరంగా, ప్రతిష్టాత్మకంగా మారుతున్న పరిస్థితి. ఎన్టీఆర్ మనవరాలు, స్వర్గీయ హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పొత్తులో భాగంగా ఇతర నియోజక వర్గాల్లో టీడీపీ పోటీ, ప్రచారం ఒకెత్తు అయితే… ఈ నియోజక వర్గంలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు, నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కూడా సుహాసిని తరఫున ప్రచారానికి దిగారు. అయితే, ఇంకోపక్క… ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా ఈ ఎన్నికను బాగా సీరియస్ గానే తీసుకుంది..!
ఆంధ్రాలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కులాలు, ఇతర వర్గాలు ఏవైతే కూకట్ పల్లిలో ఉన్నాయో… వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో వైకాపా నేతలు బాగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి వేదికగా కార్తీక వన భోజనాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది! గడచిన కొద్దిరోజులుగా కూకట్ పల్లి ఎన్నికలే కేంద్రంగా వైకాపా కొన్ని వనభోజనాలను తెర వెనక నుంచి నిర్వహిస్తోందనీ, ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు కూకట్ పల్లి చుట్టుపక్కల బాగానే ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన సానుభూతిపరులు కూడా వనభోజనాల కార్యక్రమానికి జన సమీకరణ చేసే పనిలో తమ వంతు సాయం చేస్తోందన్న గుసగుస కూడా వినిపిస్తోంది. ఇక్కడ వైకాపా ప్రధానంగా చేస్తున్న ప్రచారం ఏంటంటే… ఎన్టీఆర్ కుటుంబంపై నిజంగానే చంద్రబాబుకి ప్రేమ ఉంటే, సుహాసినికి ఆంధ్రాలో సీటిచ్చి మంత్రిని చెయ్యొచ్చనీ, కానీ… మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రా రాజకీయాల్లో పోటీ ఉండకూడదన్న లక్ష్యంతోనే కూకట్ పల్లి టిక్కెట్టు ఇలా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారనేది! నిజానికి, తెరాస తరఫున కేటీఆర్ కూడా ఇదే కోణంలో విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ ఉనికి కాపాడుకోవాలంటే పొత్తులో భాగంగా దక్కించుకున్న సీట్లన్నీ గెలవాలి. కానీ, ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపాకి ఇక్కడ ఉనికే లేదు. కనీసం ఈ ఎన్నికల్లో ఒక్క చోటైనా పోటీ చేయడం లేదు. కానీ, కూకట్ పల్లిలో టీడీపీ ఓటమే ఆ పార్టీ ప్రధాన అజెండాగా మార్చేసుకుంది. ఎందుకంటే, కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి ఓడిపోతే, ఆ మేరకు ఆంధ్రాలో ప్రచారం చేసుకోవచ్చనీ, ఏపీలో చంద్రబాబు ఓటమికి ఇక్కడ పునాదులు పడ్డాయనే అంశాన్ని ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చన్నది వారి వ్యూహమనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.