తెరాస నేతల నోటి నుండి ఇంకా ‘ఓటుకి నోటు కేసు’ ప్రస్తావన రాలేదేమిటాని అందరూ అనుకొంటున్న సమయంలోనే మంత్రి హరీష్ రావు దాని గురించి ప్రస్తావించి, నేరుగా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావుని గ్రేటర్ ఎన్నికలకి దూరంగా ఉంచినప్పటికీ చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడానికి ఆయన ‘సేవలను’ ఉపయోగించుకోవడం వ్యూహాత్మకమే కావచ్చును.
“ఓటుకి నోటు కేసు దెబ్బకి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని, తన పార్టీని కూడా విడిచిపెట్టి ఆంధ్రాకి పారిపోయారు. దానితో తెలంగాణాలో తెదేపా నాయకుడు లేని పార్టీగా మిగిలిపోయింది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తరువాత ఇక రాష్ట్రంలో ఆ పార్టీ కనబడకుండా పోవడం తద్యం. ఓటుకి నోటు కేసు బయటపడకపోయుంటే ఈ ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు డబ్బు మూటలు సిద్దం చేసుకొని ఉండేవారు. మీడియాతో ప్రచారం చేయించుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ రావాలంటేనే ఆయన భయపడుతున్నారు. ఆయన దైర్యం చేసి రెండు రోజులు హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నా దాని వలన ఆ పార్టీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఓటుకి నోటు కేసుతోనే ఆ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. రోహిత్ మృతి కారణంగా బీజేపీకి కూడా గ్రేటర్ లో ఎదురుగాలి వీస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పనవసరం లేదు. నగరంలో దాని ఉనికే చాటుకోలేకపోతోంది. ఆ మూడు పార్టీలు కలిపి ముప్పై సీట్లు సంపాదించుకోగలిగితే అదే గొప్పనుకోవచ్చును,” అని హరీష్ రావు అన్నారు.
ఓటుకి నోటు కేసును తెరాస బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నందునే ఇన్ని రోజులు దానిని ప్రచారంలో పాల్గొంటున్న తెరాస నేతలెవరూ బయటకి తీయలేదనుకోవచ్చును. ఇప్పుడు హరీష్ రావు దానిని బయటకి తీసి తెదేపాపై సంధించారు కనుక ఇక తెరాస నేతలు అందరూ కూడా దానిని మిగిలిన ఈ మూడు రోజులలో తెదేపాపై విరివిగా ప్రయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలలో తెదేపా తరపున నారా లోకేష్ గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ, తెరాసపై గట్టిగా దాడి చేస్తున్న వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డేనని స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈరోజు నుండి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు కనుక వారివురిని నిలువరించాలంటే ఓటుకి నోటు కేసు కంటే గొప్ప ఆయుధం ఉండబోదు. దానిపై వారిరువురూ ఎలాగూ సమాధానం చెప్పుకోలేరు కనుక ఇకపై తెరాస నేతలు అందరూ దానినే ప్రధానంగా ప్రస్తావించవచ్చును.
ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వలన తెరాసకు మరో లాభం కూడా ఉంది. ఈ ఎన్నికలలో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీని దానికి దూరం చేయవచ్చును. ఎందుకంటే ఈ ఓటుకి నోటు వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెదేపాకి వ్యతిరేకంగా తన పార్టీ అధిష్టానానికి,కేంద్రప్రభుత్వానికి లేఖలు కూడా వ్రాసారు. కనుక ఈ సమయంలో తెదేపా నేతలు మళ్ళీ దానికి సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఏర్పడినట్లయితే, బీజేపీ నేతలు అందరూ తెదేపాకు దూరంగా జరుగవచ్చును. అదే జరిగితే దాని వలన తెరాస లబ్ది పొందుతుంది.