‘తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వయసు పెద్దదైపోయింది. విజన్ 2050 అంటారు.. అంతవరకే ఏం చేస్తారు? అప్పటికైనా యువతకు నారా లోకేష్ ఉద్యోగాలు ఇప్పించగలరా..? కొడుకు మీద ప్రేమతో ద్రుతరాష్ట్రుడిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అనంతపురంలో జరిగిన కవాతు సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో హక్కు ఉంటే.. దాని చంద్రబాబు వదిలేసుకుని… ఇప్పుడు ఒకటో రెండో సీట్ల కోసం తెలంగాణలో పర్యటనలు చేయాల్సిన ఖర్మ ఏంటన్నారు.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ… ఆయన మీదున్న కేసులే ఆయన్ని తినేస్తాయన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నే కేసులు వదల్లేదనీ, జగన్ పరిస్థితి కూడా అంతే అన్నారు. కొన్నాళ్లు భాజపా వాడుకుని ఆయన్ని వదిలేస్తుందనీ, కాబట్టి అలాంటి నాయకుణ్ని నమ్ముకుని ప్రయోజనం లేదన్నారు. బుగ్గలు నిమరాడల పనిలో జగన్ బిజీగా ఉంటున్నారనీ, ప్రజల సమస్యలు ఆయనకి అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఆయన స్కాములు చేసి జైలుకి వెళ్లారనీ, ఆయనేం స్వతంత్ర పోరాటం చేయలేదన్నారు. ఇలాంటి నాయకుడు యువతకు ఎలాంటి దిశానిర్దేశం చెయ్యగలరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే జగన్ భయమనీ, అందుకే అసెంబ్లీకి వెళ్లరన్నారు.
కియా ఫ్యాక్టరీ తెచ్చి గొప్పగా టీడీపీవారు చెప్పుకుంటున్నారనీ, కానీ, యువత అందరికీ దీంతో ఉపాధి వచ్చేస్తుందా, ఎక్కణ్నుంచో వచ్చినవారికో ఇక్కడ ఉద్యోగాలు తప్ప… స్థానిక యువతకు ఉపయోగం ఏముందని సీఎంని పవన్ ప్రశ్నించారు. విదేశాల నుంచి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవాళ్లు భయపడుతున్నారనీ, నాయకులకు వాటాలు ఇవ్వలేమని వాపోతున్నారన్నారు. తనతో కొంతమంది విదేశీ పారిశ్రామికవేత్తలు ఈ మధ్య మాట్లాడారనీ, 2019 తరువాత ఏపీలో జనసేన క్రియాశీలక పాత్ర పోషిస్తుందని వారికి నివేదికలు అందాయని చెప్పారన్నారు! జనసేన అధికారంలోకి వస్తే విదేశాల నుంచి పెట్టుబడులు పరుగులు తీస్తూ వస్తాయన్నారు. అనంతపురం జిల్లాలో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం పరిచయం చేస్తే అద్భుతాలు సాధించొచ్చు అన్నారు.
టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అంటూ పవన్ ఆవేశంగా శపథం చేయడం విశేషం! ఇంకోటి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని వేరే కోణంలో.. అంటే, వయసు అయిపోయిందన్న తరహాలో విమర్శించే కోణాన్ని పవన్ ఎంచుకోవడం గమనార్హం. చంద్రబాబుకి వయసైపోయింది, జగన్ జైలుకు వెళ్లడం ఖాయం… ఇక ఉన్నది తానేననే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశారు.