ఈతరం కథానాయికలు విమర్శను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ట్విట్టర్ పేజీల్లో అభిమానుల ట్రోలింగ్‌లను సైతం సహించలేకపోతున్నారు. వాటిపై తమ కోపాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. మీడియాకూడా నెగిటీవ్ ప్రశ్నలు అడగడానికి జంకుతోంది. ఎప్పుడు, ఎలా స్పందిస్తారో తెలీక. అయితే.. తమన్నా మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకత చాటుకుంది. నెగిటీవ్ కామెంట్ల విషయంలోనూ పాజిటీవ్‌గా స్పందించింది. ‘సినిమాలు తగ్గినప్పుడల్లా తమన్నా పనైపోయిందన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటప్పుడు బాధగా అనిపిస్తుందా?’ అని తమన్నాని అడిగితే.. చాలా పాజిటీవ్‌గా స్పందించింది.
”తమన్నా పని అయిపోయింది అన్నప్పుడల్లా నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే… అలాంటి కామెంట్లు ఎప్పుడు వింటానో.. అప్పుడు నా కెరీర్ బిజీగా మారిపోతుంది. అంతకు ముందు కంటే ఎక్కువ సినిమాలు వచ్చిపడుతుంటాయి. మంచి పాత్రలు దక్కుతుంటాయి. యేడాది క్రితం సరిగ్గా ఇలాంటి కామెంట్లే విన్నాను. 2018 అంతా నేను బిజీగానే ఉన్నాను. ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నాకేం బాధ అనిపించదు. ఓ క్షణం ఆలోచిస్తానంతే. నా గురించి నేను కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా” అని చెప్పుకొచ్చింది. తమన్నా ఇలా స్పందించడం, ఇంత స్పోర్టివ్‌గా ఆలోచించడం మెచ్చుకోవాల్సిన విషయమే. ఈ స్ఫూర్తి మిగిలిన కథానాయికల్లో ఎప్పుడు చూస్తామో.