రాజకీయాల స్థాయి నానాటికి దిగజారుతూనే ఉంది కానీ వాటి స్థాయి ఇంకా క్రిందకి దిగజారకుండా ఆపడానికి నేతలెవరూ ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే పరిస్థితులు వారి చెయ్యి దాటిపోయి చాలా కాలమే అయ్యింది. కనుక అందరూ ఒకరిపై మరొకరు బురద జల్లుకొంటూ ఆ బురదలోనే కాలక్షేపం చేసేస్తున్నారు. ముఖ్యమంత్రి తల నరుకుతానని ఒక ఎమ్మెల్యే అంటే మరొకరు ముఖ్యమంత్రిని ‘కామ మంత్రి’ అంటారు. వారిని వారించవలసిన వ్యక్తి ఆ ముఖ్యమంత్రి కాలరు పట్టుకొని నిలదీయమని ప్రోత్సహిస్తుంటారు.
అందుకు అటు నుండి కూడా అంతకంటే చాలా ఘాటుగా, ధీటుగానే జవాబులు, ప్రతిక్రియలు వస్తాయి. ప్రజా ప్రతినిధులను సభ నుంచి ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేయబడతారు. వారి మీద పోలీసు కేసులు నమోదు అవుతుంటాయి. పరువు నష్టం దావాలు పడతాయి. అందుకు ప్రతిపక్షం కూడా మళ్ళీ అంతే ధీటుగా ప్రతిస్పందిస్తుంది తప్ప ఈ సమస్యకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకోదు. ఎందుకంటే ఎవరు వెనక్కి తగ్గితే వారు ఈ రాజకీయ చదరంగంలో ఓడిపోయినట్లు పరిగణించబడతారు తప్ప విజ్ఞత ప్రదర్శించినట్లు అవదు కనుక. అందుకే అందరూ మల్లెపూవు వంటి తెల్లటి బట్టలు వేసుకొని ఆ బురదలోనే పొర్లుతూ ఒకరిపై మరొకరు బురద జల్లుకొంటూ నిత్యం హోలీ ఆడుకొంటూ వినోదిస్తుంటారు.
వైకాపా మహిళా ఎమ్మెల్యేల నోటి దురుసుతనాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమర్ధించడం ఒక పెద్ద తప్పు. దానిని ఎదుర్కోవడానికి తెదేపా వ్యవహరించిన విధానం కూడా తప్పే. ఇంతవరకు శాసనసభలో, మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవడం విమర్శించడంతో సరిపెట్టుకొన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం, పరువు నష్టం దావాలు వేసుకొంటూ రాజకీయాలను మరో మెట్టు క్రిందకు దిగజారినట్లు కనిపిస్తోంది.
ప్రజల పట్ల విదేయంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజలను గౌరవించడం మానేసి చాలా దశాబ్దాలే అయింది. దానికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఇప్పుడు వారు సాటి ప్రజా ప్రతినిధులని కూడా గౌరవించలేని స్థితికి దిగజారిపోయారు. దేశంలో మత అసహనం పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. కానీ నిజానికి రాజకీయాలలోనే అసహనం పెరిగిపోయిందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. రాజకీయాల స్థాయిని ఎంతగా దిగజార్చుకొంటే అంతగా తామే నష్టపోతారని వారికీ తెలుసు. ఇవ్వాళ్ళ తాము నెలకొల్పుతున్న ఒక దుస్సంప్రదాయం ఏదో ఒకరోజు మళ్ళీ తమ పీకకే ఉరిత్రాడయి చుట్టుకొనే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. కానీ పరిస్థితులు వారి చేయిదాటిపోవడంతో అందరూ ఆ బురద ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు.