“మెరుగైన సమాజం కోసం” అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నా… టీవీ 9 మాత్రం ఎప్పుడూ.. మెరుగైన టీఆర్పీ కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో.. కత్తి, సుత్తి వార్తలను రోజుల మొత్తం నడపడానికి కూడా వెనుకాడదు. ఎలక్ట్రానిక్ మీడియా…ప్రజలకు సమాచారాన్ని ఇచ్చేందుకే కాదని… తనదైన మార్క్ రియల్ రియాల్టీ షోలను నడిపిస్తూ కావాల్సినంత ప్రజాదరణ పొందింది. ఆ చానల్‌కు ఇప్పటి వరకూ రాజకీయ ముద్ర లేదు. కొన్ని పార్టీలకు వంత పాడుతుందని … అన్ని పార్టీల నేతలూ విమర్శిస్తారు. దీన్ని బట్టి చూస్తే.. మొత్తంగా తేలేదేమిటంటే.. టీవీ కేవలం.. టీఆర్పీల కోసం.. తప్ప.. ఏ పార్టీకి సపోర్ట్ కాదు.. అసోసియేట్ కాదు.. అది నిన్నామొన్నటి వరకే..! ఇప్పుడేం జరుగుతోంది..?
సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అనే ఊరుపేరూ లేని సంస్థ…టీఆర్ఎస్… 94 నుంచి 104 సీట్లను గెలవబోతోందని.. సర్వే చేసి ఇచ్చింది. టీవీ 9 దాన్ని ప్రసారం చేసింది. ఆ సర్వేను చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది టీవీ 9 యేనా..? ఎందుకు ఇంత ఆశ్చర్యం అంటే… ఆ చానల్.. మనసు చంపుకుని… ఇప్పటి వరకూ ఇలా వాస్తవ విరుద్ధంగా ఉంటాయని తెలిసి కూడా.. ఏ వార్తా కథనాన్ని ..సర్వేను ప్రసారం చేయలేదు మరి..! . కానీ ఆ రికార్డును బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఆ సర్వే ప్రసారం ఆ చానల్లో “తప్పని సరి తద్దినం”లా వచ్చిందన్న విషయం.. స్క్రీన్ మీదకు వచ్చిన ప్రజెంటర్, గెస్టులను చూస్తే అర్థమైపోతుంది. ఈ సర్వే ప్రసారం విషయంలో.. టీవీ 9లో చాలా జరిగిందని… మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో.. టీవీ 9ను.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేశారు. అయినప్పటికీ.. రవిప్రకాష్ నేతృత్వంలోనే… చానల్ నడుస్తోంది. ఆ చానల్ కొనుగోలు చేసేటప్పుడే… వార్తల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని..కొత్త యాజమాన్యం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
కానీ దానికి విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయని.. సోమవారం నాటి పరిణామాలతో నిరూపితమయిందని అంటున్నారు. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సర్వేను ప్రసారం చేయాలని.. టీవీ 9 ఎడిటోరియల్ బాధ్యులు ఎంత మాత్రం అనుకోలేదు. చాలా మందిలాగే.. ఆ సర్వే విశ్వసనీయతను వారు గుర్తించలేదు కూడా. కానీ… ఆ చానల్ సీఈవో.. అత్యంత ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చింది. గంట గంటకూ… ఫోన్లు చేసి.. తీవ్రమైన ఒత్తిడి చేశారు. ముందుగా లైట్ తీసుకోవాలనుకున్న సీఈవోకు.. తర్వాత అది సాధ్యం కాదని తేలిపోయింది. చివరికి ఎయిర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. రోజూ వచ్చే ప్రజెంటర్.. తన వల్ల కాదని.. చేతులెత్తేశాడు. దాంతో.. మురళీకృష్ణ అనే ప్రజెంటర్‌ను రంగంలోకి దింపారు. పోనీ.. దీన్ని విశ్లేషించడానికి ఎరైనా ప్రముఖ నేతల్ని పిలిచారా అంటే.. అదీ లేదు. సర్వే సంగతి తెలిసి.. చాలా మంది గెస్టులు వెనక్కి వెళ్లిపోయారు. ఉన్న వాళ్లతోనే బండి నడిపించారు.
మధ్యలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ కలిపి.. మొత్తం సర్వే వ్యవహారాన్ని.. టీవీ 9 ఇమేజ్ను మరింతగా డ్యామేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఉత్తమ్ ప్రశ్నలకు.. మురళీకృష్ణ సమాధానాలు చెప్పలేకపోయారు. అదే సమయంలో సోషల్ మీడియాలో.. వచ్చిన ఫీడ్ బ్యాక్ టీవీ9 ఎడిటోరియల్ టీమ్‌ను మరింతగా కుంగిపోయేలా చేసింది. కొద్ది రోజుల క్రితం… ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… కొత్తపలుకు అర్టికల్‌లో… ” మీడియాను బెదిరించి.. అదిరించి. అనుకూలంగా రాయించుకుని సంతృప్తి పడితే.. నిజంగానే.. పరిస్థితులు మారిపోవు..అలా చేయడం వల్ల.. అటు మీడియా కు.. ఇటు.. ప్రభుత్వానికి కుడా మైనస్సేనని ” చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీవీ 9 విషయంలో ఇది అక్షరాలా నిజం అయ్యే అవకాశం కనిపిస్తోంది.