ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ సన్నాహాల్లో పర్యావరణ నియమాలను పక్కన పడేశారు. అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలే గ్రీన్ ట్రిబ్యునల్ కి అడ్డంగా దొరికిపోయే సంకటంలోకి రాష్ట్రప్రభుత్వాన్ని నెట్టేశాయి. పనులు వెంటనే ప్రారంభం కావాలన్న ముఖ్యమంత్రి వత్తిడే ఇందుకు మూలమని అధికార వర్గాలు నీళ్ళు నములుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు అధికారుల్ని ప్రభుత్వం బలిపశువుల్ని చేసింది.
రాజధాని నిర్మాణంలో పర్యావరణ చట్టాల్ని రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘించిందని 2015 ఫిబ్రవరిలో న్యాయవాది పండలనేని శ్రీమన్నారాయణ, మాజీ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వేర్వేరుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటీషన్లు వేశారు. రాజధాని ప్రాంతం లో పంటలు, తడినేలలు నాశనం చేస్తున్నారన్నది వారి అభియోగం.
తడి నేలలు ఉన్న పక్షంలో క్యాపిటల్ సిటీకి ప్రతిపాదించిన 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టొద్దని, పంటలు తొలగించొద్దని అక్టోబర్‌లో ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అక్కడ తడినేలలు గుర్తించాలని, గట్లు చెరపొద్దని ఆదేశించింది.
మాస్టర్‌ప్లాను తోపాటు, ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ కి ప్రభుత్వం అందజేసిన రికార్డుల్లో అక్కడ తడినేలలున్నాయని, కొండవీటివాగు ముంపు సమస్య ఉందని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో తడినేలలు లేవని సమాచార హక్కు చట్టం కింద ఒక మాజీ ప్రజా ప్రతినిధికి బదులిచ్చారు. పరస్పర విరుద్ధంగా వున్న ఈ రెండు డాక్యుమెంట్లనూ పిటీషనర్లు ట్రిబ్యునల్ కి అందజేశారు.
ప్రభుత్వం ఆధ్వర్యాన ఉన్న రాష్ట్ర పర్యావరణ బోర్డుకు కేవలం 1.7 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే అనుతిచ్చే అధికారముంది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అదీ దిగువ స్థాయి అధికారి సంతకంతో ఇచ్చింది. ఈ అక్రమాన్ని కూడా ట్రిబ్యునల్ ముందుంచారు.
మరోవైపు ఏ పనీ చేయలేదని ట్రిబ్యునల్ కుప్రభుత్వం తెలియజేసిన తరువాత అధికారులు లింగాయపాలెంలో అరటితోటలు తొలగించారు. రైతు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ పని చేసిన ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించారు. నష్టానికి పరిహారం చెల్లిస్తామని తోట యజమానికి అధికారులు లిఖితపూర్వకంగా హామీనిచ్చారు. ఈ రెండు విషయాలనూ సాక్ష్యాలుగా పిటీషనర్ సమర్పించారు. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం ఇంతవరకూ మూడుసార్లు వాయిదా తీసుకుంది.
పర్యావరణ చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించినట్టు రుజువైతే ఐదు నుండి పదిశాతం వరకూ జరిమానా పడే అవకాశం వుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.47 వేల కోట్లని ప్రభుత్వమే పేర్కొంది. ఈ రూపేణా చూస్తే కనీసం రూ.2700 కోట్ల వరకూ జరిమానా పడే అవకాశముంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి పదిశాతం జరిమానా విధించగా అక్కడి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీన్ని ఐదుశాతానికి తగ్గించింది. గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా వేస్తే ఖచ్చితంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రిబ్యునల్ విధించిన జరిమానా చెల్లించి ఆపనులను కొనసాగించే అవకాశంలేదు. జరిగిన తప్పులకే జరిమానా… పర్యావరణ ఉల్లంఘన కేసుల్లో జరిమానా ఆంటే ఉల్లంఘన కొనసాగింపునకు క్రమబద్ధీకరణ కాదు.
ట్రిబ్యునల్ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా కూడా ”అమరావతి” ప్రాధాన్యత రీత్యా నియమ నిబంధనలను సడలించి అయినా రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సహకరిస్తుంది. అయితే ఆ ప్రొసీజర్లన్నీ పూర్తయ్యే సరికి కాలయాపన తప్పదు. అంతకు మించి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పెద్ద తలవంపే అవుతుంది.