వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు .. హాట్ టాపిక్‌గా మారిపోయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి అసలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలోనే కాదు.. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా.. తెలంగాణలో ఎవరు గెలుస్తారన్న చర్చ నడుస్తోంది. అయినా సరే… సొంత రాజకీయ పార్టీలు ఉండి.. తెలంగాణ అంటే…ప్రేమని.. ఉద్దరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్న ఈ ఇద్దరూ… అత్యంత ధైర్య సాహసాలతో.. ఎన్నికల సమరం నుంచి నిష్క్రమించి.. ఇప్పుడు ఏపీలో.. ” మగతనం” గురించి చర్చ మొదలు పెట్టారు. నీ మగతనం ఎంతంటే.. నీ మగతనం ఎంత అని.. బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు.
అసెంబ్లీని వెళ్లి పోరాడలేని జగన్మోహన్ రెడ్డికి మగతనం ఉందా.. అని కొద్ది రోజుల కిందట పవన్ కల్యాణ్… తూర్పుగోదావరి జిల్లా పోరాటయాత్రలో తీవ్ర విమర్శలు చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి.. నిన్నటి రాజాం పాదయాత్రలో.. కౌంటర్ ఇచ్చారు. పవన్ మగతనం గురించి.. సూటిగా ప్రశ్నలు సంధించారు. కార్లలాగా భార్యలను మార్చడం మగతనమా..? ఒకరితో కాపురం చేస్తూనే మరొకరితో పిల్లలను కనడం మగతనమా?. రేణూ దేశాయ్‌ని నీ అభిమానులు దూషిస్తున్నా మౌనంగా ఉండటం మగతనమా?. తప్పు ఎత్తిచూపిన వారి ఇళ్లలోని ఆడాళ్లపై తప్పుడు పోస్టింగ్‌లు పెట్టించడం మగతనమా? అంటూ.. రివర్స్ ఎటాక్ చేశారు. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను పవన్ కల్యాణ్ రోడ్డుమీదికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య ఇటీవలి కాలంలో పెద్దగా మాటల మంటలు లేవు. వారి మధ్య సఖ్యత కోసం కొంత మంది ప్రయత్నిస్తున్నారని కలసి పోటీ చేసినా..ఆశ్చర్యం లేదన్న మాటలు వినిపించాయి. అయితే అనూహ్యంగా.. ఓ సందర్భంలో… జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని పవన్ విమర్శించారు. దానికి ప్రతిగా..జగన్… మూడు వేళ్లు చూపించి.. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఆరోపించారు. ఆ తర్వాత నుంచి వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చర్చ మగతనం మీదకు వెళ్లింది. ఇది రాజకీయవర్గాలకు ఆసక్తికరంగానే ఉన్నా… ఓ సందేహం మాత్రం చాలా మందిని పట్టి పీడిస్తోంది.. జగన్మోహన్ రెడ్డి పదే పదే… పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపిస్తూంటారేంటి..? పవన్ చేసుకున్నది మూడే కదా.. అనేదే ఆ సందేహం. దీనిపై జగనో, పవనో క్లారిటీ ఇవ్వకపోతే.. చిలువలు పలువుగా.. సోషల్ మీడియాలో చెప్పుకునే ప్రమాదం ఉంది..!