పవన్ కల్యాణ్ సినిమా రంగం నుంచి.. రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఆయన సినిమా పరిభాషను ఎక్కువగా వాడుతారు. టీజర్లు, ప్రి రిలీజ్ ఫంక్షన్లుగా.. రాజకీయ కార్యక్రమాలను పోలుస్తూ ఉంటారు. తన రాజకీయ వ్యవహారాల్లోనూ.. అదే పద్దతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంపై.. నాన్చి.. నాన్చి.. చివరకు.. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత.. రెడీ కాలేకపోయామని.. అందుకే.. పోటీ చేయడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో… తన మద్దతు ఎవరి కో త్వరలో ప్రకటిస్తానని.. చెప్పుకొచ్చారు. ఇంత వరకూ ప్రకటించలేదు కానీ… ప్రచార హోరు చివరి దశకు వచ్చిన తర్వాత ఓ ట్వీట్ పెట్టారు. అందులో కూడా.. తన మద్దతు ఎవరికో చెప్పలేదు.. కానీ .. ఐదో తేదీన చెబుతానన్నారు. అంటే టీజర్ రిలీజ్ చేసినట్లన్నమాట. అసలు రిలీజ్ ఐదో తేదీన ఉంటుంది.
మద్దతు ప్రకటిస్తే బీఎల్‌ఎఫ్‌కు డిపాజిట్లు కూడా రాకపోతే ఎలా..?
ఇంత వరకూ బాగానే ఉన్నా.. పవన్ కల్యాణ్ మద్దతు ఎవరడిగారు అన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్… పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ పవన్ ఆలోచించుకునే తీరిక లేక పక్కన పెట్టేశారు. ఇప్పుడు.. మద్దతు అయినా ప్రకటిస్తారా.. అన్న ఆంశలు ఆ ఫ్రంట్‌లో ఉన్నాయి. కానీ… పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించిన తర్వాత కూడా.. ఆ ఫ్రంట్ ఎక్కడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోతే పరిస్థితి ఏమిటన్నది .. జన సైనికుల ముందున్న ప్రధాన సందేహం. ఇప్పటికే తెలంగాణలో.. పొలిటికల్ పొలరైజేషన్ వచ్చింది. టీఆర్‌ఎస్‌నా..? ప్రజాకూటమినా..? అన్న పద్దతిలో ఓటర్లు చీలిపోయారు. ఇలాంటి సందర్భంలో.. బీఎల్‌ఎఫ్‌కు మద్దతు ప్రకటించడం.. ఇబ్బందికరమేనని అంటున్నారు. తను స్వయంగా మద్దతు ప్రకటించిన తర్వాత… బీఎల్ఎఫ్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతే..ఏపీలో… టీడీపీ నేతలు.. టీజింగ్ ప్రారంభిస్తారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్.. టీడీపీని తానే గెలిపించానని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు మరి..!
టీఆర్ఎస్కు మద్దతిస్తే ఏపీలో సెంటిమెంట్ దెబ్బతినదా..?
పోనీ ప్రగతి భవన్‌కు పిలిచి భోజనం పెట్టిన కేసీఆర్‌కు … జాతీయ మీడియా ఇంటర్యూల్లో.. అద్భుతంగా పని చేస్తోందని.. పదికి ఆరు మార్కులేసిన సర్కారుకు మద్దతు ప్రకటిద్దామా అంటే.. ఏపీలో తన బేస్ దెబ్బతింటుందేమోనన్న ఆందోళన ఉంది. నిజానికి జనసైనిక్స్.. ఏపీ రాజకీయ పరిస్థితులను.. తెలంగాణకు అన్వయించుకుని… టీడీపీ ఉన్న మహాకూటమిని ఓడించి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్కు సోషల్ మీడియాలో స్వచ్చంద ప్రచారం కూడా చేసి పెడుతున్నారు. అయితే.. ఇవన్నీ అనధికారికమే…తనకేం సంబంధం లేదని డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ.. ఎవరికి మద్దతు ప్రకటించాలనే సమస్య మాత్రం అలానే ఉండిపోతుంది. ఇప్పటికే.. కూకట్పల్లి లాంటి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్‌కు బలంగా ఉండే.. సామాజికవర్గాన్ని టీఆర్ఎస్ దువ్వేసిందని.. దీని వెనుక పవన్ మద్దతు ఉందని కూడా చెబుతున్నారు కాబట్టి… తెలంగాణ ప్రజల క్షేమం.. కొత్త రాష్ట్రం ప్రగతి కోసం… టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదన్న భావన ఉంది. ఒక వేళ టీఆర్ఎస్ గెలిస్తే.. ఏపీలో చెప్పుకున్నట్లు… టీఆర్ఎస్ను తానే గెలిపించానని.. తెలంగాణలో కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మద్దతును కేటీఆర్ కానీ.. కేసీఆర్ కానీ అడిగారో లేదో కానీ… అడిగి ఉంటే మాత్రం.. పవన్ కల్యాణ్.. వెనక్కి తగ్గే అవకాశం లేదు.
ఉరుకున్నంత ఉత్తమం – బోడిగుండంత సుఖం అని ఊరకనే అన్నారా..?
అయితే జనసైనికులు మాత్రం.. పవన్ కల్యాణ్.. మద్దతుపై ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందని బాధపడుతున్నారు. ఎవరికి మద్దతు ప్రకటించినా.. ఏదో ఓ విమర్శ వస్తుంది. అసలు.. ఎన్నికల్లో పోటీ వద్దని ఊరుకున్న తర్వాత గెలుక్కోవడం ఎందుకని వారి వాదన. ఎలాగూ..లోపాయికారీ సపోర్ట్ ఇచ్చేవాళ్లకి ఇస్తున్నాం కానీ… ఎందుకు.. ఇలా నేరుగా మద్దతు ప్రకటనపై టెన్షన్ పడటం అని వారి వాదన. ఉరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం కాదా.. అని మథన పడుతున్నారు.
— Subhash