కొడంగల్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవండ్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి అరెస్ట్ పై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ విచారణ లో… పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ బంద్ కు పిలుపునిచ్చారని ..అల్లర్లు జరుగుతాయన్న ఉద్దేశంతోనే.. రేవంత్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో వాదన వినిపించారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్ కు పిలుపునిస్తే తప్పేమిటని.. రేవంత్ ను అరెస్ట్ చేసి. ఏ నేరాన్ని ఆపారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది.రేవంత్‌ను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏ విధంగా పోలీసులు అంచనాకు వచ్చారో చెప్పాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
దీంతో నిఘా వర్గాల మీదకు.. పోలీసులు అభాండాన్ని తోసేశారు. నిఘా సమాచారం వచ్చిందని.. అందుకే అరెస్ట్ చేశామన్నారు. హైకోర్టు మళ్లీ.. నిఘా నివేదికను అందించాలని ఆదేశించింది. అయితే పోలీసులు ఆ వివరాలు కోర్టుకు సమర్పించడానికి గడువు కోరి.. కోస్గిలో సీఎం సభ అనంతరం రేవంత్ ను విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదిక బుధవారం ఇస్తామనడంపై.. న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
హైకోర్టు సీరియస్ అవడంతో.. రజత్ కుమార్ కూడా.. మూడున్నర సమయంలో.. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు.. బంద్ కు పిలుపునిస్తేనో… అడ్డుకోవాలని పిలుపునిస్తేనో అరెస్ట్ చేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఖమ్మంలో.. ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్.. చంద్రబాబు ప్రచారానికి వస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కానీ.. ఈ విషయంలో.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ… రేవంత్ అడ్డుకుంటామని చేసిన ప్రకటన ఆధారంగా… రేవంత్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు.