కొడంగల్ ప్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని.. రేవంత్ రెడ్డి మండి పడ్డారు. రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి.. రూ. 150కోట్లు పంపిణీ చేసి.. కొడంగల్ ప్రజల ఆత్మాభిమానాలను కొనాలనుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల వాహనాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కొండగల్ కు మొదట హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్.. చివరికి కేసీఆర్ కూడా వచ్చారని.. ఇలా ఒక్కొక్కరు కాదు.. ఒక్కసారిగా ముగ్గురూ రావాలని సవాల్ చేశారు. అరాచకాలు సృష్టించి కొడంగల్‌లో గెలవడానికి యత్నిస్తున్నారని .. కేసీఆర్ కుట్రలను కొడంగల్ ప్రజలు తిప్పికొడతారన్నారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి.. కొడంగల్ కు తీసుకొచ్చి పోలీసులు విడిచి పెట్టారు. ఆ తర్వాత కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
కావాలనే కేసీఆర్ తన నేతలపై దాడులు చేయిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహిళలపై మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారనన్నారు. వందల మంది పోలీసులు బలవంతంగా ఇంట్లోకి వచ్చి గొర్రెను ఈడ్చుకుపోయినట్లు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల కోసం గళంవిప్పిన తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారన్నారు.
నియంతల పాలనలో కూడా ఇంతటి అరాచకాలు జరగలేదని .. తెలంగాణలో ప్రతిపక్షాల గొంతునొక్కడానికి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారుని మండిపడ్డారు. కేసీఆర్ ముందు కొడంగల్ ప్రజల మనసులు గెలవాలి.. ప్రజల్ని భయపెడితే గెలుస్తామనుకోవడం కేసీఆర్ భ్రమ అని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా… కేసీఆర్‌కు ముందస్తుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు.
కేసీఆర్ తీరు చార్లెస్ శోభరాజ్.. బిల్లారంగకు మద్దతు తెలిపినట్లు ఉందన్నారు. ఇది రేవంత్‌రెడ్డి మీద జరిగిన దాడి కాదు…2 లక్షల ప్రజల మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. కొడంగల్‌లో పంపకాల్లో విభేదాలు వస్తే హరీశ్ పరిష్కరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో పదిహేడు కోట్లు పట్టుబడినా.. దాచి పెట్టారని మండి పడ్డారు. ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు లభించినా.. సీఈసీ అధికారులు ఎందుకు కొడంగల్‌లో విచారణకు రావట్లేదని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా చేసిన ఫిర్యాదును రజత్‌కుమార్ పట్టించుకోలేదని ఎందుకు తన ఫిర్యాదుపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.