తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం కొన్ని గంటల్లో ముగియబోతోంది. ఒకరకంగా ఇవి కేసీఆర్ కోరుకున్న ఎన్నికలు. ఆయన కోరి తెచ్చిన ముందస్తు ఎన్నికలు. ఓ రెండు నెలలపాటు తీవ్రంగా శ్రమించి, ఢిల్లీలు టూర్లు పెట్టుకుని… 2019లోపే అసెంబ్లీ ఎన్నికలు జరిపించి తీరాలని భీష్మించారు, అనుకున్నట్టే జరిపించుకున్నారు. ఇంతకీ… తొమ్మిది నెలల గడువు ఉంటుండగా అసెంబ్లీ ఎందుకు రద్దు చేశారనేది స్పష్టమైన జవాబు లేని ప్రశ్నగా ఉంది. కానీ, మరోసారి తెరాస అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా నూటికి నూరుపాళ్లూ ఉంటేనే కదా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వంద సీట్లు అవలీలగా గెలిచేస్తామన్నది కేసీఆర్ ధీమా. అంతేకాదు, తెలంగాణలో అభ్యర్థులు ఎవరైనా ఫర్వాలేదు, తన కటౌట్ చాలు – తెరాసని మళ్లీ గెలిపించడానికి అనుకున్నారు. కానీ.. తాజాగా వెలువడుతున్న కొన్ని సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే… కేసీఆర్ అనుకున్న ఏకపక్ష ఫలితాలు ఉంటాయా అనే చర్చ వినిపిస్తోంది. అసెంబ్లీ రద్దు సమయంలో కేసీఆర్ అనుకున్న పరిస్థితికీ… ఇప్పుడున్న పరిస్థితికీ మధ్య కొంత తేడా ఉందా..? అంటే, కచ్చితంగా ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
అసెంబ్లీ రద్దు అని కేసీఆర్ అనగానే.. కాంగ్రెస్ తో సహా ఇతర విపక్షాలూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అన్ని పార్టీలకంటే ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యపరచారు. అయితే, సీట్ల ప్రకటన తరువాత కొంతమంది నుంచి వ్యతిరేకతను కేసీఆర్ ముందే ఊహించలేదేమో! ఇంకోటి, ఎన్నిక సందర్బంలో అభ్యర్థుల ప్రకటన అనేది రాజకీయ పార్టీలకు ఒక ఊపు తెచ్చే సందర్బం. దాన్ని తెరాస మిస్ అయిందని చెప్పొచ్చు. ఇంకోటి… ప్రజా కూటమిని కేసీఆర్ ఊహించి ఉండరు! మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలు ఒక కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉంటాయని ఎవ్వరూ అనుకోలేదు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదిక వస్తారని ఎవ్వరూ కలగనలేదు. ముందస్తుకి వెళ్దామనుకున్నప్పుడు కేసీఆర్ వేసుకునే లెక్కల్లో కచ్చితంగా ఇది ఉండదు.
ఇంకోటి.. ఈ కూటమిలోకి కోదండరామ్ వెళ్తారనేది ముందస్తు అంచనాకి దొరకని అంశమే అని చెప్పాలి. ఇదంతా ఒకెత్తు అయితే… అనునిత్యం ఆధిపత్య పోరుతో కుమ్ములాడుకునే కాంగ్రెస్ నేతలు ఒక తాటికి మీదికి వస్తారనీ, టీడీపీ, కోదండరామ్ పార్టీ, సీపీఐలను కలిపి ఉంచగలిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుందనీ ఎవ్వరూ ఊహించలేదు. అంతేకాదు, సీట్ల సర్దుబాటు ప్రక్రియలో కూడా రోజుకో గండం అన్నట్టుగానే ప్రజా కూటమి పార్టీలు వ్యవహరించాయి. చివరికి, సీట్ల సంఖ్య అటుఇటు ఉన్నా ఫర్వాలేదు… తెరాసకు వ్యతిరేకంగా పనిచేయ్యాలనే ఒక బలమైన సంకల్పం ఈ పార్టీల మధ్య రావడం కూడా ముందుగా ఊహించిన పరిణామం కాదు.
ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమయ్యాక.. ఇన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెరసి ఈ పరిణామాలే… తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఏపక్షంగా ఉండే అవకాశాలను తగ్గించాయా అనే అభిప్రాయం తాజా సర్వేల సరళినీ, కొన్ని విశ్లేషణల తీరుని చూస్తుంటే కలుగుతోంది. ఇవి కేసీఆర్ కోరుకున్న ఎన్నికలే.. కానీ, కేసీఆర్ కోరుకున్న ఫలితాలే వస్తాయా రావా అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది.