ఆంధ్రా ఆక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్‌కు ఉన్న పేరు మీడియా ఇచ్చింది కాదు. ప్రజల్లో ఆయన సర్వేలకు ఉన్న విశ్వసనీయత … ఫలితాల కచ్చితత్వంతో వచ్చింది. పార్టీలకు అతీతంగా.. కచ్చితంగా.. గెలుపోటముల్ని ప్రకటిస్తారు కాబట్టే… ఆయన సర్వేలకు అంత ప్రాధాన్యం వచ్చింది. అందుకే లగడపాటి పేరుతో… సోషల్ మీడియాలో రోజుకు పది సర్వేలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అలాంటి రాజగోపాల్… ఎనిమిది నుంచి పది వరకూ ఇండిపెండెంట్లు గెలవబోతున్నారనే సరికి… టీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ లగడపాటి .. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. నిజానికి ఆ ఐదు నియోజకవర్గాల పరిస్థితుల్లో లగడపాటి చెప్పినదానికి ఏ మాత్రం తేడా లేదు. అక్కడ ఆ అభ్యర్థులు గెలుస్తారన్న భావన ప్రజల్లో ఉంది. దాన్ని లగడపాటి బయటపెట్టారు. అలాగే… ప్రజానాడి ఎలా ఉందో చెప్పారు కానీ… ఎన్ని సీట్లు వస్తాయో ఇంకా చెప్పలేదు. పోలింగ్ తర్వాత రిజల్ట్ చెప్పనున్నారు.
సర్వేలు వ్యతిరేకంగా వస్తే.. ఎవరైనా ఆరోపణలు చేస్తారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్నాయని… ఆ పార్టీ నేతలు వాటిని ఖండిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న చిలకజోస్యంగా విశ్లేషిస్తున్నారు. అంత వరకూ వారి విధానం అనుకున్నా.. రెండు రోజులుగా.. టీఆర్ఎస్కు వంద సీట్లకుపైగా వస్తాయంటూ.. ఉదరగొడుతున్న సర్వేల మాటేమిటి..?. సన్నిహితులైన పారిశ్రామిక వేత్త కొనుగోలు చేసిన చానల్ లో ఊరూపేరు లేని సంస్థ రాసిచ్చిన లెక్కలను సర్వేలుగా ప్రసారం చేసి.. వంద సీట్లు వస్తాయని చెప్పుకుంటే.. వచ్చేస్తాయా..? సొంత చానల్ పత్రిక… 108 సీట్లు వస్తాయని రాసేసుకుంటే వస్తాయా..?. లగడపాటివి చిలక జోస్యాలు అయితే.. మరి ఈ సర్వేలు… కాకి జోస్యాలా..?.
కారుకు క్లిష్ట పరిస్థితులు ఉన్నాయనేది.. జగమెరిగిన సత్యం… కానీ టీఆర్ఎస్ నేతలు అలా అనుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే.. ప్రజలు నీళ్లు తాగుతున్నారు.. అన్నం తింటున్నారు… పంటలు పండించుకున్నారని… నమ్ముతున్నారు. అదంతా తమ చలువేననుకుంటున్నారు. తెలంగాణ రాక ముందు ప్రజలు అసలు బతకలేదని.. ఇప్పుడు మాత్రమే గాలి పీల్చుకుని బతకగలుగుతున్నారని.. ఇదంతా తమ దయవల్లేనని ఊహించుకుటున్నారు. ఫలితంగానే.. ప్రజలకు తమకు కాక ఎవరికి పట్టం కడతారన్న భ్రమల్లో ఉన్నారు. ఫలితంగా… ఇష్టం లేని వాళ్లపై దాడులు.. ఇష్టం లేని సర్వేలపై వెటకారాలు చేసి.. తమ తమ ఊహలతో… టైం పాస్ చేస్తున్నారు. నిప్పుల మీద దుప్పటి కప్పేసుకుని… తమను తాము మోసం చేసుకుంటున్నారు.