టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో తాడి దన్నే రాజకీయ నాయకుడు అయితే… ఆయనను దలదన్నే నాయకుడు.. రేవంత్ రెడ్డి. కేసీఆర్ మనస్థత్వాన్ని పక్కాగా ఔపాసన పట్టి.. ఎలా ట్రాప్ చేయాలో.. అలా ట్రాప్ చేసి.. రాజకీయంగా.. కేసీఆర్ ను పదే పదే దెబ్బకొడుతున్నారు. కానీ చూసేవాళ్లకి.. వేరేగా అనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్.. రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేస్తున్నారు. రేవంత్ రెడ్డి కోలుకోలేడని అనుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం పక్కాగా.. కేసీఆర్‌నే పదే పదే ట్రాప్‌లో పడేసి… తనే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎదిగిపోతున్నారు. అర్థరాత్రి అరెస్ట్ ఎపిసోడ్‌తో … ఇది మరోసారి నిరూపితమయింది.
రేవంత్ ట్రాప్‌లో కేసీఆర్ పడిపోయారా..?
తెల్లవారుజాము మూడు గంటలకు బెడ్రూం తలుపులు పగులగొట్టి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలు.. సోషల్ మీడియాలో రోజంతా హల్ చల్ చేశాయి. అంత తప్పు రేవంత్ రెడ్డి ఏం చేశాడనేది.. ప్రతి ఒక్కరికి వచ్చిన సందేహం. ఆయన సభను అడ్డుకుంటానని పిలుపునిచ్చారు. అలా చేసినందుకు.. హౌస్ అరెస్ట్ చేస్తే పనైపోయేది. కానీ.. పోలీసులు ఎవరి ఉత్సాహం కారణంగా అత్యుత్సాహం చూపించారో కానీ.. అరెస్ట్ చేసేశారు. నిజానికి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడానికే.. రేవంత్ రెడ్డి.. హంగామా చేశారు. అడ్డుకుంటామనే ప్రకటనలు చేశారు. బంద్ కు పిలుపునిచ్చారు. కేసీఆర్ మనస్థత్వం పక్కాగా తెలుసు కాబట్టి.. అది ఆయన అహాన్ని దెబ్బ తీస్తుందని.. దానికి రియాక్షన్‌గా అరెస్టులు ఉంటాయని రేవంత్ ఊహించారు. దానికి తగ్గట్లుగానే పరిణామాలు ఎదుర్కొని… కేసీఆర్ తీరును పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. వంద శాతం సక్సెస్ అయ్యారు. రేవంత్ వేసిన ట్రాప్‌లో … కేసీఆర్ పడిపోయారు. అవసరంగా అరెస్ట్ చేయించి… ప్రజల్లో ఓ భయానక వాతావరణం కల్పించారు. రేవంత్ దీన్ని ఓ అస్త్రంగా మలిచేసుకున్నారు.
కొడంగల్ ఆత్మగౌవరంగా రేవంత్ రెడ్డి ఎదిగారా..?
రేవంత్ రెడ్డి.. ఓ నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయనను నిలువరించాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. కొడంగల్‌లో ఓడించాలనేది.. కేసీఆర్ వ్యూహం. అందుకే.. పట్నం మహేందర్ రెడ్డి అనే.. అచ్చమైన కుబేర రాజకీయ నాయకునిగా బాధ్యతలు అప్పగించారు. ఆయన తన తమ్ముడ్ని రంగంలోకి దింపి.. ఏడాదిగా అక్కడ డబ్బుల వరద పారిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచురలందర్నీ కారెక్కించారు. హరీష్ రావు కూడా స్కెచ్‌లో భాగమయ్యారు. ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు. వారి దూకుడు చూసి.. రేవంత్ రెడ్డికి కూడా.. ఓ సందర్భంలో.. ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన కేసీఆర్‌ను ట్రాప్ లో పడేసి… కొడంగల్ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎదిగారు. ఒక్క రాత్రిలో జరిగిన పరిణామాలు.. కొడంగల్ అంటే..రేవంత్.. రేవంత్ అంటే కొడంగల్ అన్నట్లుగా మార్చేశాయి. ఫలితంగా. .ఏడాది కాలంగా.. టీఆర్ఎస్ చేస్తున్న శ్రమ నిష్ఫలం అయినట్లే. దీన్ని రేవంత్.. కొడంగల్ ఆత్మగౌరవంపై దాడిగా చెబుతున్నారు. అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలుండటానికి కూడా అవకాశం లేదు.
రేపు సీఎం కుర్చీలో రేవంత్ ఉండొచ్చన్న ఆజాద్ మాటలు దేనికే సంకేతం..?
కేసీఆర్ దొర మనస్థత్వాన్ని తను ఎంత బాగా ఉపయోగించుకున్నారో.. దాని ఫలితాలు ఎలా అందుకుంటున్నాడో.. నిన్న ఒక్క ఘటనతోనే నిరూపితమయింది. రేవంత్ ను పరామర్శించడానికి వచ్చిన హైకమాండ్ ముఖ్యుడు గులాం నబీ ఆజాద్.. రేవంత్ రేపు ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ రోజు కేసీఆర్ ఆ కుర్చీలో ఉండొచ్చు.. కానీ రేపు రేవంత్ ఆ కుర్చీలో ఉంటారు. అప్పుడేం చేస్తారన్నట్లుగా ఆజాద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూసిన వారు.. దీన్ని ఆషామాషీగా తీసుకోలేరు. రేవంత్ ఓ వారియర్ గా.. టీఆర్ఎస్ పై పోరాడుతున్న భావన వస్తోంది. దానికి తగ్గట్లుగా ఆయనకు ప్రాధాన్యం దక్కుతుందన్న ఫీలర్ హైకమాండ్ నుంచి వచ్చేసినట్లే. ఓ రకంగా ఆజాద్ ప్రకటన సాధారణ ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి.. కేసీఆర్..అధికారం ఉందనే అహంకారంతో చేసిన ఓ చిన్న తప్పు.. తను ఏ మాత్రం గుర్తంచడానికి ఇష్టపడని ప్రత్యర్థిని.. తన కంటే పై స్థాయికి తీసుకెళ్తోంది. ఈ విషయాన్ని ఆయన ఒప్పుకుంటారో లేదో చెప్పలేం..!
———సుభాష్