ఏ ఛానల్లోనూ కనిపించనంత ఎక్కువగా టీవీ 9 లో దర్శనమిస్తుంటాడు వర్మ. అసలు వర్మ మాటల్ని ఎవరూ పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా – వర్మని మాత్రం మహా గట్టిగా పట్టించుకుంటుంది టీవీ 9. ఎన్నికల సమయంలో మిగిలిన ఛానళ్లన్నీ.. రాజకీయ డిబేట్ల కోసం పొలిటీషియన్లని పట్టుకొచ్చి – కెమెరాల ముందు కూర్చోబెడితే… మరోసారి టీవీ 9 వర్మనే నమ్ముకుంది. జాఫర్ – వర్మలు కలిసి ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ‘ఓటేసేవాళ్లు ముర్ఖులు’ అనే వర్మ స్టేట్మెంట్ని పట్టుకుని ‘అసలు ఓటర్లు మూర్ఖులా, కాదా’ అంటూ జాఫర్ ప్రజాభిప్రాయం అడిగాడు. జాఫర్‌తో పాటు వర్మ కూడా టూ వీలర్‌పై ట్రావెల్ చేసి ప్రజా అభిప్రాయం తెలుసుకునే పనిలో పడ్డారు.
టీవీ 9 ఐడియా బాగానే ఉంది. వర్మని రోడ్డుపైకి తీసుకురావడం మంచి ప్రయత్నం.. మంచి ఆలోచన. కాకపోతే… ఇప్పుడున్న సినారియో ఏమిటి? వర్మ చేస్తోంది ఏమిటి? టీవీ 9 ఓటర్లని ఎలా ఎడ్యుకేట్ చేయాలనుకుంటుంది ? ఏం చేస్తోంది? ఈ విషయం కనీసం టీవీ 9కైనా అర్థం అవుతుందా? అనేదే పెద్ద ప్రశ్న.
వర్మకి ప్రజాస్వామ్యంపై, ఓటింగ్ విధానంపై ఏమాత్రం సదాభిప్రాయం లేదు. ‘అసలు నేనిప్పటివరకూ ఓటేయలేదు’ అని గర్వంగా చెప్పుకుంటాడు వర్మ. అలాంటి వర్మ ఇప్పటి ఓటర్లకు ఎలాంటి సందేశం ఇవ్వగలడు? వాళ్లపై ఎలాంటి ప్రభావం తీసుకురాగలడు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో కీలకమైన విషయం. ఓట్లపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటిది.. వర్మ మాటలు విని ‘వర్మనే ఓటేయడం లేదంటే.. మనం ఎందుకు వేయాలి’ అని నవతరం అనుకుంటే పరిస్థితి ఏమిటి? పైగా ‘ఓటర్లంతా మూర్ఖులు’ అనే వర్మ స్టేట్మెంట్ పట్టుకుని ఓటర్ల దగ్గరకే వెళ్లి ‘మీరు మూర్ఱులా’ అని ఓటర్లనే అడగడం ఏరకమైన జర్నలిజం అనిపించుకుంటుంది?
అసలు మేనిఫెస్టోలు చదవకుండా జనాలు ఓటేస్తున్నారన్నది వర్మ పాయింటు. అది నిజమే కావొచ్చు. ఓటర్లంతా మానిఫెస్టో చదవాలని రూలు లేదు. ఏ పార్టీ ఏం చెయాలనుకుంటుందో అవన్నీ పత్రికల్లో ప్రకటనల రూపంలో కనిపిస్తున్నాయి. ప్రసంగాల్లో ఊదరగొట్టేస్తున్న విషయాలు కూడా అవే కదా? ‘ఉచిత’ హామీలు ఎంత వరకూ నెరవేరతాయన్న సందిగ్థత ఓటర్లలోనూ ఉంది. ఈ మాత్రం అవగాహన వాళ్లలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ మాత్రం దానికే… ‘మీరు మానిఫెస్టో చదవలేదు కాబట్టి… మూర్ఖులు’ అని వర్మ ఎలా అనగలడు. ఓటింగ్ అనేది పరీక్షనా? పుస్తకాలు చదివి పరీక్షకు ప్రిపేర్ అయినట్టు, మానిఫెస్టో చదివి, అర్థం చేసుకున్న తరవాతే ఓటింగ్ వేయాలా? ఓటర్లకు అటు టీవీ 9, వర్మ కలసి ఏం చెబుతున్నట్టు?
వాదనలో వర్మని మించిన వాడు లేదు. ‘అవును మేం మూర్ఖులమే’ అని ఓటర్లతోనే అనిపించగలడు. అలాంటి వాదనతో ఏం సాధించినట్టు? ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతున్నట్టు. ‘నేను ఓటు వేస్తున్నా… మీరు కూడా ఓటేయండి’ అంటూ ప్రచారం చేయాల్సింది పోయి.. అసలు ఓటర్లలోనే ‘ఓటు వేయడం అవసరమా’ అనే సందేహం తీసుకొచ్చే ఇలాంటి డిబేట్లు ఎవరి కోసం..??