తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరుకి బుధవారం సాయంత్రంతో బ్రేక్ పడింది. అయితే, అసెంబ్లీ రద్దు సమయంలో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో కలిపే… మొదటి దశలోనే తెలంగాణ ఎన్నికలు కూడా జరిగిపోతాయన్న అంచనాలు ఉండేవి. దీంతో కేసీఆర్ కూడా ఒకేసారి 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అయితే, అప్పటికి కూటమి పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఏమాత్రమూ స్పష్టత లేదు. ఆ మూడు రాష్ట్రాలతోపాటు తొలిదశలోనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఉండి ఉంటే… కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడేదనే చెప్పొచ్చు. కానీ, ఇక్కడి ఎన్నికల తేదీలు చివరి షెడ్యూల్ కి వచ్చేయడంతో… దాదాపు 20 రోజుల సమయం ప్రజా కూటమికి లభించింది. అయితే, ఈ సమాయాన్ని కాంగ్రెస్, టీడీపీ, టీజేయస్, సీపీఐ పార్టీలు సమర్థంగా వాడుకున్నాయా..? అనుకున్న స్థాయిలో సంతృప్తికరమైన ప్రచారం చేయగలిగారా అంటే… ఫర్వాలేదని మాత్రమే విశ్లేషించుకోవచ్చు.
నవంబర్ 1 నుంచి 19వ తేదీ వరకూ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్ల సిగపట్లే నడిచాయి. చివరి నిమిషం వరకూ బీ ఫామ్స్ పంచుకోవడానికే సరిపోయింది. పోనీ, ఆ తరువాతైనా వెంటనే ప్రచారంపై దృష్టి పెట్టగలిగారా అంటే… అసంతృప్తుల లొల్లి మొదలైంది. రెబెల్స్ పేరుతో కొందరు, స్వతంత్రులుగా మరికొందరు, స్నేహ పూర్వక పోటీ అంటూ ఇంకొందరు… వీరందర్నీ దారిలోకి తెచ్చుకోవానికి కాంగ్రెస్ కి చాలా సమయమే పట్టింది. ప్రజా కూటమి అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రచార పర్వంలోకి పంపించడంలో కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహాత్మకంగా ముందుకు సాగలేదన్నది వాస్తవం. ఇక, బీఫామ్ అందుకున్న నాయకులు కూడా మంచి ముహూర్తాల పేరుతో.. చివరి తేదీ 19 వరకూ కూడా పంచాంగాలు పడిగడుతూ కూర్చున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తంతు పేరుతో మరో మూడ్రోజుల కాలయాపన చేశారు. ఇలా చివరి వరకూ కూటమి పార్టీల మధ్య బతిమలాటలకే సరిపోయింది. ఆ తరువాత, మిగిలింది కేవలం పదిహేను రోజుల కంటే తక్కువ మాత్రమే ప్రచార సమయం!
అయితే, ఈ మిగిలిన కొద్ది రోజులూ ప్రభావంతంగా కూటమి ప్రచారం చేయగలిగిందా అంటే.. కొంతమేరకు చేయగలిగారనే చెప్పాలి. సోనియా గాంధీతో నాలుగు సభలు పెట్టాలని మొదట్లో కాంగ్రెస్ భావించినా… చివరికి ఒక సభతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఆ తరువాత, రాహుల్ గాంధీతో వీలైనన్ని ఎక్కువ సభలే పెట్టించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చివరి దశలో వచ్చి… రాహుల్ తో కలిసి ప్రచారంలోకి దిగేసరికి కూటమికి బాగానే ఊపు వచ్చిందని చెప్పొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కొన్ని సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తానికి, ఇలా ప్రజా కూటమి ప్రచారం ముగిసింది. చంద్రబాబు, రాహుల్ రోడ్ షోలతో కొంత ఊపు వచ్చినా… ఇంకాస్త ప్రణాళికాబద్ధంగా మొదట్నుంచీ వ్యవహరించి ఉంటే… ప్రచారానికి మరింత సమయం కూటమి పార్టీలకు కలిసి వచ్చేది.