తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అనగానే తెరాస వెర్సెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి మాత్రమే అని అనుకున్నాం. కానీ, ప్రచార పర్వం ముగింపునకు వచ్చేసరికి.. భారతీయ జనతా పార్టీ కూడా మూడో ప్రధాన పోటీదారుగానే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తెరాస, ప్రజా కూటములకు ధీటుగానే భారీ బహిరంగ సభలూ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక, భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా వరుసగా కొన్ని సభలతో హోరెత్తించారు. అంతేకాదు, కొంతమంది మంత్రులతోపాటు ప్రముఖ భాజపా నేతల్ని కూడా తెలంగాణ ప్రచారంలోకి దించారు. భాజపా పట్టున్న రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనికి తగ్గట్టుగానే… తాజా సర్వేల్లో కూడా భాజపాకి గతంలో కంటే కొన్ని అసెంబ్లీ స్థానాల సంఖ్య కొంత పెరుగుతుందనే అంచనాలూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… తెలంగాణ ఎన్నికల్ని భాజపా కాస్త సీరియస్ గా తీసుకోవడం వెనక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఏర్పడింది కదా! రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే కూటమి కొనసాగుతుందనీ, ముందుగా మోడీ బీ టీమ్ ని ఇక్కడ ఓడించి, ఆ తరువాత కేంద్రంలోని భాజపాను గద్దెదించడం ఖాయమంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రచారం చేశారు. తెలంగాణలో ఆయన పాల్గొన్న అన్ని సభల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాల దృష్టి కూడా తెలంగాణవైపు మళ్లింది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి… తెలంగాణ ఎన్నికలే ఒక మోడల్ కాబోతోందనే ప్రాధాన్యత జాతీయ మీడియాలో కూడా వచ్చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారం దక్కించుకుంటే… కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడబోయే కూటమికి ఇదో ఉత్సాహవంతమైన ప్రారంభంగా నిలుస్తుందనే అంచనాలున్నాయి.
దీంతో, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ధీటుగా తెలంగాణలో భాజపా ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. పైగా, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనీసం మరో ఐదేళ్ల తరువాతి నాటికైనా భాజపా బలపడాలంటే… ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను కాస్తైనా పెంచుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహం కూడా ఆ పార్టీకి ఉందనేదీ వాస్తవమే. దీంతోపాటు, కాంగ్రెస్ కూటమి ఆధిక్యతను తగ్గించడంలో తెలంగాణలో కొంతమేరకు సక్సెస్ అయినా… రేప్పొద్దున్న జాతీయ స్థాయిలో ఆ కూటమి ప్రాధాన్యతను తగ్గించినట్టు అవుతుంది కదా! ఇలా తాత్కాలిక, దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలతో ఇక్కడ భాజపా ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి.