తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు ఒక్క రోజు ఉంది. సాధారణంగా.. ఈ ఒక్క రోజులోనే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెర వెనుక ప్రలోభాల కోసం కేటాయిస్తారు. వారి నమ్మకమైన క్యాడర్ ఈ పనిలో ఉంటుంది. డబ్బు పంపిణీ ఎక్కువగా జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లోనూ అది కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు తెలంగాణలో పోలీసుల సోదాల్లోనే ఇప్పటి వరకూ రూ. 200 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో ఎక్కువ తెలంగాణలో దొరికాయి. పట్టుడిన వారిలో ఎక్కువ రూ. రెండు వేల నోట్లు.
రూ.2 వేల నోటుతో నల్లధనం పెరిగిందా..?
నల్లధనం సాకుతో నోట్లను రద్దు చేసిన తర్వాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లన రద్దు చేసిన కేంద్రం రూ. రెండు వేల నోట్లను భారీగా విడుదల చేసింది. ఇవి నగదు కొరతను తీర్చలేవు. ప్రజలకు కావాల్సింది.. రూ. యాభై, రూ. వంద వంటి నోట్లు. నిజంగా… నగదు కొరత తీర్చడానికే అయితే రూ. రెండు వందల నోటు ముందే తెచ్చేవారు. సరిగ్గా… ఈ రెండు వేల నోటు రావడం వల్ల నల్లధనం పోగేసుకునేవారికి మరింత సౌలభ్యం కలిగించారు. ఇది నిజమే కదా. ఇప్పుడు ప్రజల వద్ద రూ. రెండు వేల నోట్లు లేవు. ఏటీఎంలలో లేవు. కానీ.. ఎన్నికల్లో పంచడానికి మాత్రం విరివిగా బయటకు వస్తున్నాయి. దీని వల్ల ఏం అర్థం అవుతుంది. నోట్లు రద్దు చేసినప్పుడు.. చాలా మాటలు చెప్పారు. నల్లధనం ఆగిపోతుంది.. డబ్బు పంపిణీ నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. మరి వందల కోట్లు ఎందుకు పట్టుబడుతున్నాయి..?
ఓటర్లకు పంచిన వేల కోట్లు ఏం చెబుతున్నాయి..?
పట్టుబడుతున్న నగదే .. రెండు వందల కోట్లు ఉంటే.. పంచేసినవి రూ. వేల కోట్లు ఉంటాయి. అంటే నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రభావం లేదని అర్థం. నోట్ల రద్దు వల్ల నల్లదనం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఇవన్నీ…ఎప్పటి నుంచో ఉన్న విమర్శలు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రిటైరైన … ఓపీ రావత్ కూడా ఇదే చెప్పారు. నోట్ల రద్దు వల్ల ఎన్నికల్లో నగదు ప్రవాహం ఆగలేదని ప్రకటించారు. ఆయన కాదు.. ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పని చేసిన అరవింద్ సుబ్రమణియన్ కూడా..తను రాసిన పుస్తకంలో… నోట్ల రద్దును క్రూరమైన చర్యగా పేర్కొన్నారు. ఇది ఎకానమీని దెబ్బ తీసిందని స్పష్టం చేశారు.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలంటే ఏం చేయాలి..?
ఎన్నికల్లో డబ్బు పంపిణీని నివారించాలి. నోట్ల రద్దు వల్ల ఎన్నికల్లో డబ్బు పంపిణి ఆగి ఉంటే.. నోట్ల రద్దును సమర్థించవచ్చు. కానీ… నగదు పంపిణీ ఆగలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మాత్రమే.. రాజకీయ వాతావరణం మారుతుంది. అప్పుడే సమాజం మారుతుంది. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన వ్యక్తి… ప్రజాధనాన్ని దోచుకుంటాడు కానీ.. సేవ చేసే ప్రశ్నే లేదు. అందువల్లే జీరో బడ్జెట్ అంటే.. పైసా ఖర్చు లేకుండా.. ఎన్నికల్లో గెలిచే వాతారవణం వస్తే.. నిజమైన ప్రజాసేవకులు వస్తారు. అంతిమంగా నోట్ల రద్దు వల్ల.. ఎలాంటి నల్లధనం బయటకు రాలేదు.. కానీ.. ఆ నల్లధనం.. తెల్లధనంగా మారింది. ఎన్నికల్లో మరింతగా నోట్ల ప్రవాహానికి కారణం అయింది. నోట్ల రద్దు సంస్కరణ.. ఎన్నికల ప్రక్రియలో నగదు పంపిణీని నివారించలేకపోయింది.