“టీఆర్ఎస్ మనిషి రాసినట్లుగా ఉంది “..
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ.. ఇచ్చిన .. ఎలాంటి అధికార ముద్రలు లేని కాగితం రిపోర్ట్‌పై.. హైకోర్ట్ వ్యక్తిం చేసిన అభిప్రాయం ఇది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత … తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు.. ఇది పక్కాగా సరిపోయే సర్టిఫికెట్. ఎందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటిదో కేసులో జగ్గారెడ్డిని కసిగా జైల్లో పెట్టడం దగ్గర్నుంచి.. కాంగ్రెస్ నేతలపై ఎప్పుడో మూలన పడిపోయిన… పెట్టీ కేసుల్ని కూడా బయటకు తీసి… ఎన్నికల సమయంలో వారిని ఓ రకంగా టార్గెట్ చేయడం వరకూ.. పోలీసులు అచ్చంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
తెల్లవారుజామున మూడు గంటలకు.. ఇంటి గోడలు దూకి… ఇంటి తలుపులు బద్దలు కొట్టి .. బెడ్రూంలోకి చొచ్చుకెళ్లి.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనేమీ పారిపోరు. ఓ రాజకీయ పరమైన నిరసనకు పిలుపునిచ్చారు. అంత మాత్రానికే… “లాడెన్” పై చేసిన తరహాపై ఆపరేషన్ చేయాలా..? ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా.. కుటుంబసభ్యులకు చెప్పకుండా తరలించాలా..? ఈ డౌట్ చాలా మందికి వచ్చింది. కోర్టుకు కూడా వచ్చింది. హౌస్ అరెస్ట్ చేస్తే పోయేదానికి అంత సీన్ ఎందుకని ప్రశ్నించింది. దీన్ని సమర్థించుకోవడం పోలీసుల వల్ల కావడం లేదు. హైకోర్టు వదిలి పెట్టడం లేదు. ఇంటలిజెన్స్ నివేదికల పేరుతో ఇచ్చిన పేపర్లు కల్పితాలని తేల్చింది. డీజీపీని కోర్టుకు పిలిపించింది. చివరికి రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు తానే మౌఖిక ఆదేశాలిచ్చానని ఆయన అంగీకరించాల్సి వచ్చింది. దీనిపై పదిహేడో తేదీన విచారణ జరగనుంది. రేవంత్ అరెస్ట్ వ్యవహారం.. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే. తానే మౌఖిక ఆదేశాలు ఇచ్చానని.. డీజీపీ ఒప్పుకున్నారు కాబట్టి… కోర్టు ఏమన్నా.. ఆయనే భరిచాల్సి ఉంటుంది.
డిసెంబర్ 17నాటికి రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. ఎలా ఉంటాయన్నది అంచనా వేయలేం. కానీ డీజీపీ వ్యవహారశైలి మాత్రం కచ్చితంగా చర్చనీయాంశమవుతుంది. ఎందుకంటే.. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ కీలక పదవుల్లో ఉన్నప్పుడు… ఇతర పార్టీల నేతలపై వ్యవహరించిన తీరు.. అంతే వివాదాస్పదంగా ఉంది. ఫోన్ ట్యాపింగుల దగ్గర్నుంచి.. నేతల్ని ట్రాప్ చేయడానికి.. వేసిన ఎత్తుల్లో భాగం కావడం వరకూ.. అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ప్రభుత్వం మారితే… లెక్క తేల్చకుండా ఉండరు. అదే రాజకీయం.. !