జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని ప్రారంభించిన ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. పోటీ చేయాలా వద్దా.. అన్న ఆలోచనలతోనే పుణ్యకాలం గడిపేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు కానీ.. చివరికి ఆయన పోటీ చేయకపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు బలంగా వినిపించడానికి.. నిర్ణయం తీసుకోలేకపోతున్న పవన్ కల్యాణ్ బలహీన ప్రధానంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల విషయంలో.. పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు ప్రధానంగా దీన్నే సూచించింది.
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత.. అన్ని రాజకీయ పార్టీలు.. సన్నాహాల్లో మునిగిపోయాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. తన కనీస స్పందనను వారం రోజుల తర్వాత ప్రెస్‌నోట్ రూపంలో వెల్లడించారు. అందులో ఏం చెప్పారంటే… ఏమీ చెప్పలేదనే చెప్పాలి. అసెంబ్లీని రద్దు చేశారు.. తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.. ఆ మాట చెప్పడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పోటీ చేస్తున్నారో లేదో చివరి క్షణం వరకూ .. అంటే నామినేషన్ల గడువు ముగిసే వరకూ.. అధికారికంగా ప్రకటించలేదు. మధ్యలో.. ఫ్యాన్స్ .. వెళ్లి ఆయన ఇంటి ముందు ధర్నా.. రేపు..మాపు నిర్ణయం తీసుకుందామంటూ చెప్పుకొచ్చారు. చివరికి నామినేషన్ల గడవు ముగిసేటప్పుడు…ముందస్తు రావడం వల్ల ప్రిపేర్ కాలేకపోయామని చెప్పి.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిజానికి ఆ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అప్పటికే.. నామినేషన్ల గడువు ముగిసింది కాబట్టి.. పోటీ చేయరని క్లారిటీ ప్రజలకు వచ్చేసినట్లే.
అయితే.. పోటీ ప్రస్తావన వచ్చినప్పుడు.. ముందస్తు రావడం వల్లే పోటీ చేయడం లేదని చెప్పడంతో పాటు.. ఎవరికో ఒకరికి మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. ఎవరికి మద్దతిస్తారన్నదాన్ని కూడా చివరికి వరకూ నాన్చారు. పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కి మద్దతిస్తారేమోనని అందరూ అనుకున్నారు. లేకపోతే.. సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కైనా మద్దతు ప్రకటిస్తారనుకున్నారు. చివరికి తన గందరగోళం మొత్తం కనిపించేలా.. ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఎవరికి మద్దతన్న విషయం చెప్పకుండా… నీతి వాక్యాలు చెప్పారు. చెబుతానన్నదేమిటి..? చెప్పిందేమిటో..ఎవరికీ అర్థం కాలేదు. మొత్తంగా చూస్తే.. రాజకీయాల విషయంలో పవన్ కల్యాణ్‌కు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని మాత్రం క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.