డిసెంబరు 7 అనగానే.. అందరికీ తెలంగాణ ఎన్నికలే గుర్తొస్తాయి. అటు టీఆర్ఎస్ – ఇటు మహా కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారిన నేపథ్యంలో… ప్రజల మూడ్ రాజకీయాలవైపే ఉండడం అత్యంత సహజం. అయితే.. టాలీవుడ్ మాత్రం డిసెంబరు 7న 3 సినిమాలు రిలీజ్ చేయాలన్న సాహసం చేస్తోంది. ‘కవచం’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘నెక్ట్స్ ఏంటి’ చిత్రాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి. ఓపెనింగ్ డే అన్నది ఏ సినిమాకైనా అత్యంత కీలకం. తెలంగాణలో ఉదయమంతా ఓటింగ్ హడావుడి ఉంటుంది. ఓటేశాక… అంతా టీవీ సెట్ల ముందు సెటిల్ అవ్వడం ఖాయం.
ఇలాంటి తరుణంలో ఓపెనింగ్ డే.. బాక్సాఫీసు దగ్గర డల్‌గా ఉండే అవకాశం ఉంది. 7న ఇలా ఉంటే.. 11న ఫలితాలొస్తాయి. ఆ రోజైతే… ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు కదిలే పరిస్థితి కనిపించదు. అంటే ఇలా రెండు రోజులు కూడా వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణ ఎన్నికలే కదా, అనుకొని టాలీవుడ్ రిలాక్స్ అవ్వొచ్చేమో. ఈ ఎన్నికల గురించి తెలుగువాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ మలుపునూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. సినిమాలు విడుదల చేయడమే సాహసం. వరుస ఫ్లాపులతో డీలా పడిన బెల్లంకొండ, అసలు కొన్నేళ్లుగా హిట్టే లేని సందీప్ కిషన్, మొన్న మొన్న కాస్త ఊపిరి పీల్చుకుని మళ్లీ సినిమాలు తీస్తున్న సుమంత్ సినిమాలు బరిలో ఉన్నాయి.
పోస్టర్లపై వీళ్ల ఫొటోల్ని చూసి… థియేటర్లకువెళ్లే పరిస్థితి లేదు. సినిమా బాగుంది అంటేనే… పికప్ ఉంటుంది. తొలిరోజు అందరూ టీవీల ముందు, ఓటింగ్ బూతుల ముందు క్యూ కడితే.. థియేటర్లో కనిపించేదెవరు? అనేదే పెద్ద ప్రశ్న. నిర్మాతలు మాత్రం ”ఎంత హడావుడి ఉన్నా. సాయింత్రానికి చల్లబడుతుంది. ఫస్ట్ షో, సెకండ్ షోలు తప్పకుండా థియేటర్‌కి రావాల్సిందే” అని లెక్కగడుతున్నారు. ఏం జరుగుతుందో మరి.