తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి గ్రేటర్ పైనే ఉంది. గ్రేటర్లో ఎవరిది పై చేయి అవుతుందనేదే అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న అంశం. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. కచ్చితంగా.. ఓటింగ్ శాతం మీదనే ఆధారపడి ఉంది. గ్రేటర్ పరిధిలో దాదాపుగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అత్యధికం గెలుచుకునేవారికి… ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసి పదిహేను సీట్లు సాధించాయి. ఎంఐఎం ఏడు, టీఆర్ఎస్ ఐదు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కూడా రాలేదు. ఎక్కువ చోట్ల మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి సమీకరణాలు మారాయి. టీడీపీ – కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ విడిగా పోటీ చేస్తోంది. టీఆర్ఎస్ ఒంటరిగా పోరాడుతోంది.
గ్రేటర్లో ఫలితాలు.. ఓటింగ్ శాతం మీదనే ఆధారపడి ఉన్నాయని… గత రికార్డులు చెబుతున్నాయి. 2014 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్ జరిగింది. ఆ సమయంలో సెంటిమెంట్ ప్రకారం ప్రజలంతా విడిపోయి ఉన్నారు. అందుకే.. అయితే టీడీపీనా..లేకపోతే.. టీఆర్‌ఎస్‌నా అన్న పద్దతిలో ఓట్లేశారు. సహజంగా… హైదరాబాద్ పరిధిలో సెంటిమెంట్ ప్రభావం తక్కువ కాబట్టి… అత్యధికంగా టీడీపీ కూటమికి సీట్లు వచ్చాయి. అయితే.. 2016 లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. అంటే… ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా సెటిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. సాధారణంగా.. అసెంబ్లీ ఎన్నికలపై చూపించినత ఆసక్తి.. మున్సిపల్ ఎలక్షన్స్ పై ప్రజలు చూపించరు. అదే జరిగింది.
ఈ సారి ఎంత పోలింగ్ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లోలా… యాభై శాతానికిపై ఆరవై శాతానికి దగ్గరగా పోలయితే మాత్రం.. అది ఏదో ఓ పక్షానికి అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ.. ఓటర్లను.. ఓటు హక్కు వినియోగించుకునేదిశగా ప్రొత్సహిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్ పేట, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తార్నాకలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఇలాంటి చోట్ల ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నారు. గ్రేటర్ లో పోలింగ్ శాతాన్ని బట్టి.. ఫలితం ఎవరిదో అంచనా వేయవచ్చు.