తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమియంది. ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ.మొత్తం రెండు కోట్ల 80 లక్షల 64 వేల 684 మందికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటీ 41 లక్షల 56 వేల 182 కాగా.., మహిళా ఓటర్ల సంఖ్య కోటీ 39 లక్షల 5 వేల 811. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5 లక్షల 75 వేల 541 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా భద్రాచలంలో లక్షా 37 వేల 319 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 32, 815 పోలింగ్ కేంద్రాలుంటే.. అందులో 5 వేల కేంద్రాలు సమస్యాత్మకమైనవి. 1500 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి 90 వేల మంది భద్రతా బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు… సుమారు 50 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. అటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల నుంచి, కేంద్ర బలగాల నుంచి మరో 20 వేల మంది తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే దగ్గర్నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూం కు తరలించే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది ఎన్నికల సిబ్బంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను పెంచింది. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ర్టైకింగ్ ఫోర్స్‌ను నియమించారు. ఈ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు.
119 నియోజకవర్గాలకు 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో గంట ముందుగా… అంటే.. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ విధుల్లో మొత్తం లక్షా 49 వేల 923 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో పోలింగ్ అధికారులు 74 వేల 873 మంది . ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 37 వేల 594 మంది. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 37 వేల 556 మంది . 119 నియోజకవర్గాల్లోని 32,815 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌కు 55 వేల 329 ఈవీఎంలను 39 వేల 763 కంట్రోల్ యూనిట్లు, 42 వేల 751 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు.