అదేంటో… తెలుగు కథానాయికలకు ఇక్కడకంటే.. పక్క రాష్ట్రాల నుంచి అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. పొరిగింటి పుల్లకూరకు రుచెక్కువ కదా. మనవాళ్లు పక్క రాష్ట్రం నుంచి కథనాయికల్ని దిగుమతి చేసుకుంటుంటే, అక్కడి వాళ్లు, మన తెలుగమ్మాయిలవైపు చూస్తుంటారు. స్వాతి, అంజలి లాంటి కథానాయికలు, తెలుగు సినిమాల్లో కంటే తమిళంలోనే ఎక్కువ రాణించారనిపిస్తుంది. ఇప్పుడు అదే బాటలో వెళ్తోంది ఈషారెబ్బా.
‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈషా. అయితే… ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’లో అవకాశం దక్కించుకుని, ఓ చిన్న పాత్రలో మెరిసింది. దాని వల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. తను కథానాయికగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ రేపు (శుక్రవారం) విడుదల అవుతోంది.
స్వాతిలా… ఈషా కూడా తమిళ చిత్రసీమపై దృష్టి పెట్టింది. ఇప్పుడు అక్కడో సినిమా చేస్తోంది. కన్నడ చిత్రసీమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. శివరాజ్ కుమార్ సరసన ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే.. అటువైపు కూడా దృష్టి సారించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలుగు పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అన్యాయం జరుగుతోందన్న మాటని పెద్దగా పట్టించుకోవడం లేదు ఈషా. ”ఈ మాట చాలాకాలం నుంచి వింటూనే ఉన్నాం. గతంలో ఏం జరిగిందో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం తెలుగమ్మాయిలకు మంచి పాత్రలే దక్కుతున్నాయి. ప్రతిభ ఉంటే అవకాశాలు చేజిక్కించుకోవడం అంత కష్టమేం కాదు. నాకొస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగానే ఉన్నా. ఎవరిపైనా కంప్లైంట్స్ లేవు” అని తేల్చి చెప్పింది ఈషా.