మోడీ మెడలు వంచి ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికలు జరుగుతూండగానే పెద్ద షాక్ తగిలిదింది. తెలంగాణలో రిజర్వేషన్లు 67 శాతానికి పెంచుకునే అవకాశం ఇవ్వాలంటూ.. ప్రభుత్వం దాఖలు చేసి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రిజర్వేషన్లు 50 లోపు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం 50 శాతం లోపే ఉండాలని స్పష్టం చేసింది.
రిజర్వేషన్ల అంశం.. తెలంగాణ రాష్ట్ర సమితి కీలక హామీల్లో ఒకటిగా ఉన్నాయి. ముస్లింలకు బీసీల కోట పన్నెండు శాతం, ఎస్టీకు మరో పన్నెండ శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ… అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. వాటిని కేంద్రానికి ప్రస్తుతం అవి కేంద్రం వద్ద ఉన్నాయి. అధికారికంగా వాటిని తోసి పుచ్చకపోయినా… ప్రధానమంత్రి మోడీ కానీ.. బీజేపీ అద్యక్షుడు అమిత్ షా కానీ.. తెలంగాణ వచ్చినప్పుడల్లా ముస్లిం రిజర్వేషన్లకు అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతూ ఉంటారు. కానీ.. తమిళనాడు తరహాలో తమకు రిజర్వేషన్లకు నిర్ణయించుకునే హక్కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ హడావుడి చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. చట్టబద్ధత లేకపోయినా… 67 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దానిపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేరుగా.. ప్రభుత్వం వేసిన రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టి వేసింది. దాంతో.. తెలంగాణలో 50 శాతమే రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వాల రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్ 9లో పెట్టిస్తే పనైపోతుంది. కానీ.. కేంద్రం రిజర్వేషన్ల అంశాన్ని కదిలించడానికి సిద్దంగా లేదు. ఎందుకంటే.. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ రిజర్వేషన్ల సమస్యలు ఉన్నాయి.