తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఉత్కంఠ ప్రారంభమయింది. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ రెండూ.. తమకంటే.. తమకు 80కి పైగా స్థానాలు వస్తాయని ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం.. చాలా హోరా హోరీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీవీ 9 ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ సింపుల్ మెజార్టీకి మూడు స్థానాల దూరంలో ఆగిపోతుందని తేల్చింది . మరో తెలుగు ప్రముఖ చానల్ ఎన్టీవీ ఎగ్జిట్ పోల్… తెలంగాణ రాష్ట్ర సమితికి 58 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆంధ్రజ్యోతి ఈ లెక్కను 55 దగ్గర స్థిర పరిచింది. ఇక ప్రముఖ దినపత్రిక ఈనాడు అంచనా ప్రకారం టీఆర్ఎస్ కు 65 స్థానాలు లభించవచ్చు. తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు అయితే..టీఆర్ఎస్ కు 80 సీట్లు వస్తాయని కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
టైమ్స్ నౌ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో… తెలంగాణలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తెరాస అని అంచనా వేసింది. తెరాసకు 66 స్థానాలు దక్కుతాయనీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమికి 37 దక్కుతాయని చెప్పింది. భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు వస్తాయనీ, ఎమ్.ఐ.ఎమ్.కి కూడా 7 సీట్లు మాత్రమే వస్తాయని టైమ్స్ నౌ చెబుతోంది.
ఇక, రిపబ్లిక్ జన్ కీ బాత్ విషయానికొస్తే… ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెరాసకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే విధంగా అంచనాలు వేసింది. ఆ పార్టీకి 50 నుంచి 65 మాత్రమే వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమికి 38 నుంచి 52 స్థానాలు వస్తాయని అభిప్రాయపడుతోంది. అంటే, కూటమికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు దగ్గర్లో ఉండే సంకేతాలు ఇచ్చింది.
హైదరాబాద్ కి చెందిన ఆరా ఏజెన్సీ సర్వే చూస్తే… తెరాసకి 75 నుంచి 85 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమికి 25 నుంచి 35 మాత్రమే వస్తాయని చెప్పింది. భాజపాకి రెండు, లేదా మూడు మాత్రమేననీ, ఎమ్.ఐ.ఎమ్.కి 8, ఇతరులకు 3 వస్తాయని చెప్పింది. కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు తెరాసకు కొంత అనుకూలంగా ఉన్నాయి.
మొత్తంగా.. తెలుగు ప్రముఖ మీడియా సంస్థలు… చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ప్రజాకూటమికి అధికారం దక్కే అవకాశాలు లేవు. సాధారణ మెజార్టకి ఒకటి, రెండు స్థానాలు తక్కువ అయినప్పటికీ… అధికారం టీఆర్ఎస్ దగ్గరే ఉంటుందని ఏకాభిప్రాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నదానిపై.. ఎక్కడా పెద్దగా అనుకూల, వ్యతిరేక పవనాలు కనిపించలేదు. మధ్యలో ప్రజాకూటమి గెలుస్తుందన్న ప్రచారం జరిగినప్పటికీ… టీఆర్ఎస్ వ్యూహం మార్చి.. చంద్రబాబును హైలెట్ చేసి.. తెలంగాణ సెంటిమెంట్ పెంచడంతో టీఆర్ఎస్ కు ప్లస్ ్యిందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో పోలింగ్ ట్రెండ్స్ భిన్నంగా సాగినట్లు అంచనా వేస్తున్నారు. సనత్ నగర్ లో తక్కువ పోలింగ్ నమోదవడంతో.. ఆపద్ధర్మ తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటపడతారంటున్నారు. అదే సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి పోలింగ్ ట్రెండ్ అనుకూలంగా లేవన్న అంచనాలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. టీవీ చానళ్ల పరంగా వేర్వేరుగా ఉన్నాయి. అయితే పోలింగ్ హోరా హోరీగా సాగిందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు… ఒకటి, రెండు శాతం తేడాతో.. తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే టీవ చానళ్లు .. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విషయంలో మరింత విశ్లేషణలు జరిపి.. చివరిలో మార్చే అవకాశం కూడా ఉంది. ఆయా మీడియా సంస్థలు తమ అంతర్గతం వేసకున్న అంచనాలు. ప్రకటించకపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.