“ఓట్ల గల్లంతు నిజమే.. క్షమించండి..” ఎన్నికల ప్రధానాధికారిక రజత్ కుమార్ సైనీ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థులు చేతులేత్తేసిన పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. సామాన్యూడి ఓటు గల్లంతయితే… ఎవరూ పట్టించుకోరు కానీ… సెలబ్రిటీల ఓట్లు గల్లంతయితే మాత్రం… మీడియా హైప్ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు.. సామాన్యుల గొంతుక కూడా బయటకు వస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా.. కొన్ని వేల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఓటర్ లిస్టులో పేరు ఉండాలంటే.. బతికి ఉండాలని నిరూపించుకోవాలన్నట్లుగా ఈసీ అధికారులు వ్యవహరించడమే దీనికి కారణం. చాలా చోట్ల.. ఒక్కొక్కరికి మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా.. పట్టించుకోలేదు కానీ.. ఒకే నియోజకవర్గంలో ఉండి.. వీళ్లు లేరని అనుమానించిన వాళ్ల ఓట్లన్నీ గల్లంతయ్యాయి. హైకోర్టు జడ్జి ఓటు, ఐపీఎస్ అధికారి తన్నేటి కృష్ణ ప్రసాద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు.. ఇలా.. చెప్పుకుంటూ… పోతే ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఇక సామాన్యుల సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓటు వేసే ఉత్సాహం ఉన్న వాళ్లకు ఓటు తీసేశారు. ఓటు వేయని వాళ్లకు జాబితాలో చోటు దొరికింది. ఇది పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది.
ఓట్ల జాబితా లేకుండా ఎన్నికలు జరపడం ఎందుకు..?
నిజానికి తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసేనాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభంలో ఉంది. ఇది సంపూర్ణంగా జరగేలా జనవరికి షెడ్యూల్ ఇచ్చారు. అప్పటికే.. వివిధ రకాల ప్రామాణికాలను సాకుగా చూపి.. లక్షల ఓట్లు తొలగించారు. దేశంలో ప్రజలందరూ.. తమ ఓటు తమకు లిస్టులో ఉందని.. పదే పదే చూసుకుని.. బాధ్యతగా ఓటు వేసేంత చైతన్యానికి రాలేదు. అధికారులు… తమ పని తీరుతో.. ఓటర్లకు పరీక్ష పెడతారని.. ఆ పరీక్షను.. పాసై.. ఓటును కాపాడుకుని.. తీసేస్తే.. మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరిగి… అందులో చేర్చుకుని ఓటేసేంత.. తీరిక ప్రజలకు లేదు. ఇవన్నీ తెలిసి కూడా.. అడ్డదిడ్డంగా… ఓటర్ల జాబితాలను రెడీ చేసి.. ఎన్నికలు నిర్వహించేశారు. ఇలా ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది.
ఆరు నెలల గడువున్నా ఈసీ ఎందుకు తొందర పడింది..?
ఓటర్ల జాబితా లేనప్పుడు.. దాని సవరమ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు.. కొన్ని నిబంధనలు అడ్డం పెట్టుకుని లక్షల ఓట్లను.. జాబితా నుంచి తొలగించినప్పుడు.. ఉన్నపళంగా ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ గడువు ఉన్నప్పటికీ.. కూడా.. ఎన్నికల సంఘం.. ఆఘమేఘాల మీద.. మూడు నెలల్లో.. ఎన్నికలు నిర్వహించేసింది. ఎవరైతే.. ఓట్లు వేసి… ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలో వాళ్లను లెక్కలోకి తీసుకోకుండా.. ఎన్నికల క్రతువు నిర్వహించేసింది. అంటే.. ఈసీ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించినట్లేనా..?
వేర్వేరు ఓటర్ల జాబితాల పంపిణీ ఎందుకు..?
ఓటర్ల జాబితాలో పేరు ఉంది. స్లిప్ కూడా వచ్చింది. కానీ పోలింగ్ బూత్‌కు వెళ్తే.. ఏజెంట్లు లిస్ట్ చూసి… ఓటు లేదన్నారు. కానీ.. పోలింగ్ అధికారి దగ్గరకు వెళ్లి నిలదీస్తే.. ఆయన తన దగ్గర ఉన్న లిస్ట్లోఉందని చెప్పి ఓటు వేయించారు. ఈ ఘనట హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో జరిగింది. అంటే.. ఓటు ఉన్నా.. దాన్ని వినియోగించుకునేందుకు … పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ లొసుగేమిటంటే… ఇలా ఓటు లేదని… చెప్పడంతో.. వెళ్లిపోయిన ఓటర్ల సంఖ్య ఆ ఒక్క బూత్‌లోనే పదుల సంఖ్యలో ఉంది. నిజానికి వారికి ఓట్లు ఉన్నాయి. కానీ జాబితాలో లేకపోవడం వల్ల వేయలేదు.
ఏ విధంగా చూసినా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శుభమైన సూచనలు ఇవ్వవు.. ఇవ్వలేవు..!
—– సుభాష్