లగడపాటి నిన్న ప్రకటించిన సర్వే ఫలితాలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. జాతీయ సర్వేల తో పాటు ఇతర ప్రాంతీయ సర్వేలన్నీ ఒకలాగా , లగడపాటి సర్వే మాత్రం మరొక లాగా ఉండటం ఈ చర్చకు ప్రధాన కారణం. అయితే లగడపాటి ఫలితాలు ప్రకటించే సమయంలో చెప్పిన మాట ఏమిటంటే దాదాపు 72 శాతం ఓటింగ్ జరిగినట్టు అంచనా అని, ఆ అంచనా మీద ఈ ఫలితాలు ప్రకటిస్తున్నానని లగడపాటి వ్యాఖ్యానించారు.
ఓటింగ్ శాతం పెరిగితే ఫలితాలు ఒకలాగా ఓటింగ్ శాతం తగ్గితే ఫలితాలు మరొకలాగ ఉంటాయన్నది లగడపాటి వాదన. దీనితో చాలామంది సెఫాలజిస్ట్ లు, విశ్లేషకులు ఏకీభవించక పోయినప్పటికీ లగడపాటి మాత్రం తన సర్వే ఫలితాలు ప్రకటించే ప్రతిసారి ఓటింగ్ శాతం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 2014 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం ఎంత ఎక్కువగా పెరిగితే తెలుగుదేశం పార్టీకి అంత ఎక్కువగా సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందే ప్రకటించాడు.
ఓట్ల శాతం పెరిగితే ఫలితాలు మారతాయా? అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి?
సాధారణంగా చాలా పార్టీలు తమ ప్రత్యర్థుల కంటే కేవలం ఒక్క శాతం లేదా రెండు శాతం ఓట్లు ఎక్కువ తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాము. కాబట్టి ఓట్ల శాతం పెరిగితే దాని ప్రభావం కచ్చితంగా ఫలితాలపై ఉంటుంది. అయితే సాధారణంగా ఓట్ల శాతం పెరగటం గురించి, అది ఫలితాలపై ప్రభావం చూపే విధానం గురించి రెండు సూత్రాలు ఉన్నాయి.
మొదటిది ఏంటంటే సాధారణంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ప్రతి సారి ఎన్నికలలో పాల్గొంటూనే ఉంటారు. పట్టణ , నగర ప్రాంత ఓటర్లు మాత్రం కొన్ని సార్లు పాల్గొంటారు , కొన్ని సార్లు పాల్గొనరు. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగితే పట్టణ ప్రాంతాలలో మొగ్గు ఉన్న పార్టీలకు కాస్తంత అనుకూలత ఉంటుంది అనేది చాలా మంది నమ్మే అంశం. 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లో కూడా లగడపాటి ఉద్దేశం ప్రకారం జగన్ పార్టీకి రూరల్ ఓటర్లలో ఎక్కువగా మొగ్గు ఉంటే అర్బన్ ఓటర్లలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు ఉంది. బహుశా అందుకే ఒకసారి ( 2014 ఎన్నికల కంటే ముందు) ఫ్లైట్ లో తనను కలిసిన బ్రదర్ అనిల్ కుమార్ విజయమ్మ లేదా షర్మిల ను విశాఖపట్నం, మల్కాజ్గిరి లాంటి అర్బన్ స్థానంలో పోటీ చేయించాలనుకున్నట్టు చెబితే అలాంటి అర్బన్ స్థానం నుంచి కాకుండా కర్నూలు గాని ఒంగోలు కానీ ఇలాంటి రూరల్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయించాలని తాను సలహా ఇచ్చినట్లు లగడపాటి ఆ మధ్య ఎప్పుడో చెప్పారు. కాబట్టి 2014 ఎన్నికలలో, ఎన్నికల శాతం పెరిగే కొద్దీ అర్బన్ ఓటర్ల అనుకూలత ఎక్కువగా ఉండే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఉండవచ్చు.
ఇక ఓట్ల శాతం పెరగడం గురించిన రెండవ అంచనా ఏమిటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది అనేది. ఉన్న ప్రభుత్వమే కొనసాగాలి అనుకుంటే లేదా ఎలాగో ఉన్న ప్రభుత్వమే మరలా వస్తుంది అన్న అంచనా ఉంటే, ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓటు వేయాలని ప్రయత్నించరు అని, కానీ ప్రభుత్వం మీద పీకలదాకా కోపం ఉన్నప్పుడు మాత్రం బూత్ దాకా వచ్చి క్యూలైన్లో నిలబడి మరీ ఓట్లు వేస్తారని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఈ సూత్రం అన్నిసార్లు కరెక్టు కాదు. కొన్నిసార్లు కొత్త పార్టీలు పోటీ చేసినప్పుడు, రాజకీయ పరిణామాలు మారుతున్నప్పుడు ఓట్ల శాతం పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి సినీతారలు మొదటిసారి పార్టీలు పెట్టినప్పుడు వారి అభిమాన యువత ఓటింగ్లో చురుగ్గా పాల్గొనడం కూడా ఓటింగ్ శాతం పెరగడానికి కారణం అవుతుంది. అయితేఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పడానికి వీలు లేదు. కానీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు తప్పకుండా చేదు వార్తే.
72 % కాదు 69.1%
లగడపాటి నిన్న చెప్పిన అంచనాలన్నీ 72 శాతం ఓటింగ్ నమోదవడం ఆధారంగా చేయబడ్డాయి. ఓటింగ్ శాతం పెరిగితే ఒకలాగా తగ్గితే మరొకలాగ ఫలితాలు ఉంటాయని లగడపాటి చెప్పిన దరిమిలా, ఇప్పుడు లగడపాటి ప్రకటించిన ఫలితాలు ఈ మేరకు నిజమవుతాయి అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఓటింగ్ శాతం 72 శాతం కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని లగడపాటి నిన్న అంచనా వేశారు. ఓటింగ్ శాతం పెరిగే కొద్దీ ప్రజా కూటమికి మరింత అవకాశాలు ఉంటాయన్న లగడపాటి లాజిక్ ప్రకారం చూస్తే ఓటింగ్ శాతం తగ్గితే ఆ మేరకు ప్రజా కూటమి అవకాశాలు కూడా తగ్గాలి.
మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
– జురాన్ ( CriticZuran)