రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలవైపు ఎప్పుడొస్తాడు? పార్టీని ఎప్పుడు ప్రకటిస్తాడు? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. సినిమాల గురించి మాట్లాడినంత సూటిగా, స్పష్టంగా రాజకీయాల గురించి చెప్పడు. కాకపోతే… తన పొటిలికల్ ఎంట్రీకి ఊతమిచ్చే డైలాగులు సినిమాలో పలుకుతుంటాడు. అలాంటి కథల్ని ఎంచుకుంటుంటుంటాడు. ఒకవిధంగా `కాలా`లోని కొన్ని సన్నివేశాలు రజనీ రాజకీయ అరంగేట్రానికి సన్నద్ధాలుగా కనిపిస్తాయి. ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయి రాజకీయ చిత్రాన్ని ఎంచుకోబోతున్నాడు రజనీ.
అలాంటి కథల్ని వండి వార్చడంలో దిట్ట.. మురుగదాస్. `సర్కార్`తో మురుగదాస్ వాడీ, వేడీ ఏమిటో బాక్సాఫీసుకే కాదు. తమిళ ప్రజలకూ అర్థమయ్యాయి. అందుకే ఈసారి మురుగదాస్‌కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తమిళ వర్గాలు చెబుతున్నాయి. మురుగదాస్ ఆల్రెడీ రజనీ కోసం ఓ కథ సిద్ధం చేశాడని, ఇది కూడా పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి ‘నార్కాలి’ అనే పేరు పెట్టాడట. నార్కాలి అంటే కుర్చీ అని అర్థం. దాన్ని బట్టీ… మురుగదాస్ ఈసారి రాజకీయంగా ఎలాంటి ప్రకంపనాలు సృష్టించబోతున్నాడో అర్థం అవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన కొన్ని యదార్థ ఘటనల్ని కథగా రాసుకుని, అందులో రజనీ మార్క్ కమర్షియల్ అంశాల్ని పొందుపరిచాడట మురుగదాస్. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిరోహించాడన్నదే ఈ కథ అని.. రజనీ తొలిసారి ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. తమిళనాట పొలిటికల్ డ్రామాలకు మంచి గిరాకీ ఉంది. పైగా రజనీ సినిమా అంటే చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే.. ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.