తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తాము కీలక పాత్ర పోషిస్తామంటున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి. లక్ష్మణ్. ఊహించిన దానికంటే తమకు ఓటింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. ఆ మేరకు సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవన్నారు. కాబట్టి, ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలకం కాబోతున్నామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. భాజపాలేని ప్రభుత్వం తెలంగాణలో ఉండదన్నారు. పోలింగ్ నిర్వహణపై తాము కొంత అసంతృప్తిగా ఉన్నామనీ, ఏర్పాట్లు సరిగా లేవనీ, చాలాచోట్ల భద్రతను గాలికి వదిలేసిన పరిస్థితి ఉందన్నారు.
భాజపా ప్రమేయంతో ఏర్పడే ప్రభుత్వం ఏది..? ఒకవేళ భాజపా అంతటి క్రియాశీల పాత్ర పోషించే స్థాయిలోనే ఉందనుకోండి.. తెరాసకి, లేదా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుమించిన ఆప్షన్లు ఆ పార్టీ ముందు లేవు. అలాగని, ఈ రెండు ప్రధాన పార్టీలతోనూ భాజపాకి సయోధ్య కుదిరే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. తెరాస, ఎమ్.ఐ.ఎమ్. కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. మజ్లిస్ లాంటి వారితో పొత్తున్న పార్టీలతో తాము చర్చించే అవకాశం ఉండదని లక్ష్మణ్ చెబుతున్నారు. అంటే, భాజపా మద్దతు కావాలంటే మజ్లిస్ మద్దతు లేని తెరాస అయితే ఓకే అన్నమాట! పోనీ.. కాంగ్రెస్ కూటమికి భాజపా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. జాతీయ స్థాయిలో భాజపా వెర్సెస్ కాంగ్రెస్ అనేదే వచ్చే లోక్ సభ ఎన్నికల ప్రధాన పోరు. అది ఏ రకంగానూ సాధ్యం కాదు. అంతేకాదు, కాంగ్రెస్ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఏపీలో భాజపా వెర్సెస్ టీడీపీ పరిస్థితి తెలిసిందే.
ఇలా చూసుకున్నా తెరాస, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చే పరిస్థితి భాజపాకి లేదు. ఇవన్నీ పక్కనపెడితే… ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా భాజపాకి దక్కబోయే సీట్ల సంఖ్య, ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతుందనే అభిప్రాయమూ పెద్దగా లేదు. కానీ, లక్ష్మణ్ మాత్రం చాలా ధీమాగా తామే కీలకం కాబోతున్నామంటున్నారు. అంతేకాదు, తెలంగాణలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం అమిత్ షా కూడా చర్చించబోతున్నామంటున్నారు! ఒకవేళ భాజపాకి వచ్చే సీట్ల సంఖ్యతోనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యే పరిస్థితి ఉత్పన్నమే అయితే… ఆ సందర్భంలో తెరాస వైపు మొగ్గే అవకాశాలే ఉంటాయనే అనిపిస్తోంది.