నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టం. బాలయ్య మూడ్‌ని అభిమానులే అర్థం చేసుకోలేరు. సెట్లో కూడా ఆయన శివ తాండవం ఆడేస్తుంటారు. ‘జై సింహా’ సమయంలో మేకప్ మేన్‌ని బాలయ్య దూషించిన విషయం మీడియా సాక్షిగా బయటపడిపోయింది. తన సభలలో అభిమానులకు ఇచ్చే లెంపకాయలకు లెక్కే లేదు. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ సెట్లోనూ బాలయ్య ఉగ్రరూపం చూపిస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. బాలయ్య ధాటికి రోజుకి ఒక్కరు బలైపోతున్నారని, ప్రతీ రోజూ.. ఎవరో ఒకరు బాలయ్య కోపానికి గురవుతున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడూ సెట్లో బాలయ్య చిరు బురులాడడం మామూలే. కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని, బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నామని ఈ సినిమాకి పనిచేసిన కొంతమంది బయట గుసగుసలాడుకుంటున్నారు. బాలయ్య వచ్చి ప్రశాంతంగా షూటింగ్ చేసుకుని వెళ్లిపోయిన రోజులు వేళ్ల పై లెక్క పెట్టవచ్చని ఈ సినిమాకి పనిచేసినవాళ్లే చెబుతుంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు.
‘ఎన్టీఆర్’ చిత్రానికి బాలయ్య నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పార్ట్‌గా రావాల్సిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు సినిమా షూటింగ్. దానికి తోడు… తండ్రి కథని తెరపైకి తీసుకొచ్చే అపూర్వ బాధ్యత. ఇవన్నీ బాలయ్యపై ఒత్తిడి పెంచుతున్నాయని, అందుకే బాలయ్య అప్పుడప్పుడూ సెట్లో బాలెన్స్ తప్పుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.