తెలంగాణ అధినేత కేసీఆర్ పై తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి. ఇ.వి.ఎమ్.లు టాంపరింగ్ అవుతున్నాయన్న అనుమానాలు తమకు ఉన్నాయనీ, అందుకే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చే ప్రింటింగ్ స్లిప్పులను కూడా ఓట్ల లెక్కింపులో భాగంగా లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించారనీ, 24 గంటల్లో దీనిపై తాము స్పందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. తెరాసకు కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు ఒంటేరు.
గజ్వేల్ నియోజక వర్గంలో 88 శాతం పోలింగ్ అయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత పోలింగ్ జరిగిందీ అనేది ఎన్నికల ప్రధాన అధికారి ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదన్నారు. దాన్లో ఏదో మతలబు జరుగుతోందనీ, సాంకేతికంగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు గంటలోపుగా ఓటింగ్ శాతం ప్రకటించే అవకాశం ఉందనీ, కానీ ఎందుకింత జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. తాము చాలా కష్టపడి ఎన్నికలను ఎదుర్కొన్నామనీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తమకు సానుకూల స్పందన ఉందనీ, కేసీఆర్ మీద తాను 40 నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తున్నాను అని ధీమాగా చెప్పారు ఒంటేరు. తన గెలుపు ఖాయమనే వాతావరణం ఉండటంతో తెర వెనక తెరాస ప్రయత్నాలు మొదలుపెట్టిందని అనుమానాలు ప్రజలకూ కలుగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి గెలవబోతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది కాబట్టే ఏదో జరుగుతోందన్నారు.
కారణం ఏదైనప్పటికీ… ఎన్నికలు జరిగి 24 గంటలు గడిచినా కూడా పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించలేకపోయారు! కింది స్థాయిలో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అదే కారణమని అధికారులు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణలో మొత్తం 31 జిల్లాలున్నాయి, అవి కూడా చిన్నచిన్న జిల్లాలు. అంటే, సమాచారం మరింత వేగవంతంగా రావాలి. పరిపాలనా సౌలభ్యం కోసమనే కదా ఇన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయినాసరే, జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికారికంగా లెక్కగట్టి చెప్పడానికి ఇంత ఆలస్యం కావడం… సహజంగానే కొన్ని అనుమానాలకు అవకాశం ఇస్తుంది. శనివారం రాత్రికైనా ఈ లెక్కలపై స్పష్టత వస్తుందేమో చూడాలి.