తెలంగాణలో మొత్తంగా పోల్ అయిన ఓట్ల శాతాన్ని 73.20iగా ఎట్టకేలకు ఎన్నికల సంఘం తేల్చింది. పోలింగ్ ముగిసిన తర్వాత సుదీర్ఘంగా ఓటింగ్ శాతాన్ని మదింపు చేసే ప్రక్రియ చేపట్టారు. అయితే చాలా చోట్ల.. నమోదైన ఓట్లకు.. రికార్డులకు పొంతన కనిపించకపోవడంతో… గందరగోళానికి గురయ్యారు. మాక్ పోలింగ్ నిర్వహించిన ఓట్లను క్లియర్ చేయకుండా పోలింగ్ కొనసాగించడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని.. ఈసీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులన్నీ అధిగమించి.. చివరికి 73.20గా తేల్చారు. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను మినహాయిస్తే.. గత ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ నమోదయింది. మొత్తంగా చూస్తే ఈ పెరుగుదల నాలుగు శాతానికిపైగానే ఉంది.
నిజానికి పోలింగ్ ఎంత మేర జరుగుతోందనే విషయంపై.. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అప్ డేట్ వస్తుంది. రిటర్నింగ్ అధికారులు.. గంట గంటకు ఈసీకి సమాచారం ఇస్తారు. చివరికి వారి లెక్కల్లో ఎంత తేడా వచ్చినా.. నాలుగు, ఐదు శాతం మేర తేడా రావడం కష్టం. కానీ ఎన్నికల సంఘం.. మాత్రం నిన్న పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల శాతం విషయంలో గుంభనంగా వ్యవహరించింది. రాత్రి కూడా 69 శాతం అని మీడియాకు చెప్పారు. కానీ.. అది నాలుగు శాతం మేర పెరిగి 73.20 శాతానికి చేరింది. జిల్లాల వారీగా మెదక్లో అత్యధికంగా 88.24 శాతం పోలింగ్ నమోదయింది. అతి తక్కువగా హైదరాబాద్ లో 48 శాతంగా నమోదయింది.
సర్వేలు , ఎగ్జిట్ పోల్స్ అన్నీ… పోలింగ్ శాతంపై ఆధారపడే ఫలితాలు ప్రకటిస్తూ ఉంటాయి. లగడపాటి రాజగోపాల్ కూడా.. 72 శాతం ఓటింగ్ పర్సంటేజీని ఆధారంగా చేసుకుని ఫలితాలు ప్రకటించారు. పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే.. ప్రజాకూటమికి ఎక్కువ ఫలితాలు వస్తాయని ప్రకటించారు. ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్.. పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నారు. పోలింగ్ శాతం నమోదు ఆదారంగా ఆయన రేపు లేదా ఎల్లుండి పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ ను ప్రకటించనున్నారు.
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/12/Voter-Turnout-Press-Release.pdf” title=”Voter Turnout- Press Release”]