కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం తిరుపతికి వచ్చారు. వచ్చిన కేంద్రమంత్రి తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని వీఐపీ కోటాలో ఇచ్చే నాలుగు ఎక్కువ లడ్లు తీసుకుని చక్కా వెళ్లిపోవచ్చు. కానీ ఆయన తన “ఉత్తరాది రాజకీయ” తెలివి తేటల్ని ప్రదర్శించాలనుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు పాలన దారుణంగా ఉందని.. దానికి ఆయన చదువుకున్న స్కూలే నిదర్శనమనన్నారు. తిరుపతి చోటా రాజకీయ నేతలతో సంప్రదింపులు జరిపి.. చివరికి చంద్రబాబు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కి వెళ్లి అక్కడి “దారుణమైన” పరిస్థితుల్ని మీడియాకు చూపించి… టీడీపీ పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో నిరూపించాలనుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిన్న తనంలో టిపిపిఎం స్కూలులో చదువుకున్నారు. హడావుడిగా.. మీడియాను పిలిచి వారికి టీ, టిఫిన్లు పెట్టి… ఫలానా స్కూల్లో ఎంత దుర్భమైన పరిస్థితులు ఉన్నాయో.. నిరూపిస్తాను పదండి అని బయలుదేరదీశారు ఆ స్కూల్‌కు వెళ్లబోతున్నామనే సరికే.. జర్నలిస్టులకు సీన్ అర్థమైపోయింది. కానీ ఉత్తరాది నేతలకు తమ తెలివి తేటలు ఏ పాటివో వాళ్లకే తెలిసొచ్చేలా చేయాలి కాబట్టి.. సైలెంట్‌గా జవదేకర్‌ను ఫాలో అయ్యారు.
మొదట స్కూల్ బయట ఉన్న వాతావరణాన్ని చూపించాలనుకున్నారు. చూపించారు.. కానీ విశాలమైన స్థలంలో ఆహ్లాదంగా .. శుభ్రంగా వాతావరణం ఉండటంతో…అందులో తప్పు వెదుకలేకపోయారు. తర్వాత క్లాస్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి.. స్టన్ అయిపోయారు. ఎందుకంటే…డిజిటల్ తరగతుల్లో విద్యార్థులు పాఠాలు వింటున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిగా ఆయన ఐఐటీ, ఐఐఎంలలో కూడా… పరిశీలించి ఉంటారు కానీ ఇలా ప్రాథమిక స్థాయిలోనే .. ప్రభుత్వ బడిలో డిజిటల్ పాఠాలు చెబుతూ ఉండటంతో.. షాక్‌కు గురయ్యారు. సరే.. చంద్రబాబు షో మెన్ అని చెబుతూ ఉంటారు.. ఇవన్నీ పైపై మెరుగులే.. పిల్లల ప్రజ్ఞాపాటవాల్ని ప్రశ్నించి… వారి చదువుల డొల్ల తనాన్ని బయటపెడతానని.. మరో బాణం బయటకు తీశారు. క్లాస్ టీచర్ దగ్గర పుస్తకం తీసుకుని ప్రశ్నలు అడుగుతూ పోయారు. పిల్లలు.. అన్నీ వరుసగా చెబుతూ పోయారు. ఆ తర్వాత స్కూల్లో ఉన్న అన్ని పరిశీలించారు. కానీ మీడియాకు ఏమీ చూపించలేకపోయారు.
ప్రభుత్వ స్కూళ్ల ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అర్థం చేసుకున్నారు. చివరికి తనదే తప్పని నాలిక కరుచుకుని.. స్కూల్ బాగుందని… ఇలాంటి స్కూల్స్ ఉంటే.. ప్రైవేటు స్కూళ్ల నుంచి… ప్రభుత్వ బడులకు విద్యార్థులు వస్తారని చెప్పి.. వెళ్లిపోయారు. ఏపీ ప్రభుత్వ పనితీరు.. చెత్తగా ఉందామని నిరూపించాలనుకుని.. చివరికి… అత్యంత నాణ్యమైన విద్య ప్రభుత్వ విద్యార్థులకు అందుతోందని నిరూపించి… వెళ్లారు జవదేకర్.
ప్రకాష్ జవదేవదేకర్ అనే బీజేపీ నేత మహారాష్ట్రకు చెందిన వారు. ఆయనకు ప్రజల్లో పలుకుబడి ఉండదు. ఆ మాటకు వస్తే.. రామ్ మాధవ్ నుంచి మురళీధర్ రావు వరకూ.. బీజేపీలో పెత్తనం చెలాయించేవారెవరూ ప్రజానాయకులు కాదు. కానీ దొడ్డి దారిన రాజ్యసభ పదవులు పొంది ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాలు.. కొన్ని వేల కోట్లు.. విద్య కోసం ధారబోస్తాయి కానీ… ఎక్కడా విద్యలో మెరుగుపడినట్లు ఉండవు. తమ నలుపు పెట్టుకుని.. ఇక్కడకు వచ్చి … ఏపీ విషయంలో విన్యాసం చేయబోయి.. పరువు పోగొట్టుకున్నారు జవదేకర్..!