బెట్టింగ్ అనేది.. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద జాడ్యంలా మారిపోయింది. ఐపీఎల్ వచ్చిన తర్వాత.. ఇక బెట్టింగ్ అనేది ఓ వ్యాపారంలా మారిపోయింది. ఇప్పుడు ప్రజలు దేనిపై ఉత్కంఠగా ఉంటారో.. అలాంటి దానిపై .. బెట్టింగులు విరివిగా జరుగుతున్నాయి. ఇక తెలంగాణ ఎన్నికలపై జరగకుండా ఉంటాయా..?. ఈ బెట్టింగ్ బంగ్రాజులు అందరికీ.. లగడపాటి రాజగోపాల్ పైనే ఎక్కువగా గురి ఉంది. జాతీయ చానెళ్లన్నీ.. టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినా.. ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రం… కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పారు. దాంతో.. అందరూ ఆయన మాటల్నే నమ్మి .. పందేలు కాయడం ప్రారంభించారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. ఆయన ఎక్కడ కనబడితే.. అక్కడ.. “పందెం కాయమంటారా..” అని ప్రశ్నించే వరకూ వెళ్లింది.
శనివారం… సన్నిహిత మిత్రుని బంధువు చనిపోవడంతో.. లగడపాటి రాజగోపాల్ పరామర్శకు విజయవాడ వెళ్లారు. పన్నెండున్నరకు తిరుగుపయనమయ్యారు. ఈ లోపే ఆయనను పందెం రాయుళ్లు చుట్టుముట్టారు. సర్వే అంశాలపై మాట్లాడారు. అందరికీ ఆయన ఒక్కటే చెప్పారు. కూటమి కి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 55 స్థానాలు తగ్గే ప్రసక్తే లేదని లగడపాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఆరు నుంచి ఏడు స్థానాలు వస్తాయని, తగ్గే అవకాశం లేదని కూడా వివరించారు. పోస్ట్ పోల్ సర్వే తర్వాత.. కచ్చితమైన సంఖ్య చెబుతానని వారందరికీ లగడపాటి సహనంగానే చెప్పుకొచ్చారు.
దేశవిదేశాల్లో తెలంగాణ ఫలితంపై జరుగుతున్న బెట్టింగులు ప్రధానంగా.. ప్రజాకూటమి గెలుస్తుందనే అంశంపైనే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఖమ్మంలో కూటమి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై.. కూకట్పల్లి సుహాసిని విజయంపై, కొడంగల్లో రేవంత్ రెడ్డి మెజార్టీపైనా.. కోట్లలో పందేలు నడుస్తున్నాయి. అయితే.. ఈ బెట్టింగులు తెలంగాణలో కూడా జరుగుతున్నప్పటికీ.. ఏపీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల కోట్లకూ ఈ బెట్టింగ్ వ్యవహారం చేరిపోయింది. కాకపోతే..అందరికీ లగడపాటి మీదే గురి. చివరికి తేడా వస్తే..లగడపాటి పేరు పోగొట్టుకుంటారు.. బెట్టింగులు కాసేవాళ్లు సొమ్ములు పోగొట్టుకుంటారు.. అదీ తేడా..!