తెలంగాణలో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయన్న విశ్లేషణలు వస్తూండటం.. పోలింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య మూడురోజుల గ్యాప్ ఉండటంతో కొత్త కొత్త అనుమానాలు, అంచనాలు తెరపైకి వస్తున్నాయి. అందులో రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా వస్తున్న అనుమానం ఈవీఎం ట్యాంపరింగ్. సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్.. ఓ కొత్త “టెక్నికల్ కన్ఫిగరేషన్”తో హ్యాకింగ్ ఆరోపణలు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద.. జామర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు మారుస్తారంటూ.. కొంత మంది కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ రూముల వద్ద… కాపలా ఉండటానికి ఈసీ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఈవీఎంలలో ఓట్లను లెక్కించినా ఓడిపోయే అభ్యర్థి.. అటు టీఆర్ఎస్ కానీ.. ఇటు కాంగ్రెస్ కూటమి కానీ.. ఎవరైనా కానీ…సంతృప్తి చెందే అవకాశం లేదు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈవీఎంలపై.. అనుమానాలు తీర్చడానికి.. చేసిన ప్రయత్నం వీవీ ప్యాట్ మిషన్లు. ఓటు వేసిన తర్వాత ఏ పార్టీకి పడిందో చెక్ చేసుకునేందుకు చేసిన ఏర్పాటు అది. అలా వచ్చిన ప్రింట్.. అక్కడే ఉన్న బాక్సుల్లో వేసారు. అంటే.. అది ఓ రకంగా బ్యాలెట్ అన్నమాట. ఓడిపోయిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆ బాలెట్లను లెక్కించాల్సిందేనని పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బ్యాలెట్లలో ఉన్న ఓటుకి… ఈవీఎంలో ఉన్న ఓట్లకి.. ఒకటి, రెండు తేడా వచ్చినా… అది పెద్ద గందరగోళమే.
ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి.. ఈ విషయంపై… ఈసీని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఒప్పుకోకపోతే.. కోర్టుకెళ్తానని కూడా ప్రకటించారు. ఆయన నేరుగా కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు కాబట్టి… ముందస్తుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ తక్కువ తేడాతో ఓడిపోయే అభ్యర్థులు మాత్రం.. ఈ విషయంలో.. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించడం ఖాయం. అంటే.. కౌంటింగ్ సుదీర్ఘంగా జరగబోతోందన్న విషయాన్ని మనం సులువుగానే అర్థం చేసుకోవచ్చు.