ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందుగానే… టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో… బీజేపీయేతర పక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎవరెవరు వస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశానికి కేరళ, పంజాబ్, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, కర్ణాటక సీఎంలకు చంద్రబాబు ఆహ్వానం పంపారు. అలాగే ములాయం సింగ్, అఖిలేష్, మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శరద్‌యాదవ్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఇప్పటికే కాంగ్రెస్ కూటమి యూపీఏలో ఉన్న నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది.
సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ పేరుతో బీజేపీయేతర పక్షాలు ఏకమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహణ, భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ఇప్పటికే ఓ కార్యాచరణ సిద్దం చేశారు. వాస్తవానికి ఈ సమావేశం నవంబర్‌లోనే జరగాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కారణంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్న సమయంలో.. సమావేశం పెట్టుకోవడం వల్ల ప్రజల్లో మంచి సంకేతం వెళ్తుందన్న అభిప్రాయంతో కూటమి నేతలు ఉన్నారు.
కేంద్ర వైఖరికి నిరసనగా చాలా రాష్ట్రాల్లో సంయుక్త ర్యాలీలు నిర్వహించడంపైనా ఢిల్లీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు దేవెగౌడ, కుమారస్వామిలతో మాట్లాడినప్పుడు కర్ణాటకలో రైతులతో కేంద్రానికి వ్యతిరేకంగా ఓ భారీ ర్యాలీ, సభను ఏర్పాటు చెయాలని నిర్ణయించారు. అటు బెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీ కూడా కోల్‌కతాలో జనవరిలో ర్యాలీకి ముహుర్తం ఖరారు చేశారు. మరోవైపు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ చేపట్టిన ధర్మపోరాట సభలు అమరావతి తప్ప అన్ని జిల్లాల్లో ముగిశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి అమరావతి వేదికగా చివరి ధర్మపోరాట దీక్ష చేయబోతున్నారు. ఈ సభకు బీజేపీయేతర పార్టీల నేతల్ని పిలిచే అవకాశాలున్నాయి. వీటిపై ఈ సమావేశలో నిర్ణయం తీసుకుంటారు.